Tadipatri: తాడిపత్రిలో హై టెన్షన్ ! వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి !
తాడిపత్రిలో హై టెన్షన్ ! వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి !
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలను పోలీసులు తాడిపత్రి(Tadipatri) పట్టణంలో ప్రవేశించకుండా నిషేదించారు. అయితే మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం సాయంత్రం తాడిపత్రికి భారీ అనుచరగణంతో బయలుదేరారు. స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి ఆయన వస్తున్న విషయం తెలియగానే పోలీసులు ఎ.కొండాపురం వద్ద అడ్డుకున్నారు. దీనితో పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి(Tadipatri)లోని తన ఇంట్లో కొన్ని పత్రాలు ఉన్నాయని, వాటికోసం వెళ్తున్నానని వాదించారు. దీనితో పోలీసులు ఆయన్ను వెంటబెట్టుకుని తాడిపత్రికి తీసుకొచ్చారు. ఆయన తనకు కావాల్సిన పత్రాలు తీసుకునిఅరగంటలో పోలీసు బందోబస్తు మధ్య అనంతపురానికి వెళ్లారు.
అయితే నిబంధనలకు విరుద్ధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి(Tadipatri) చేరుకోవడంతో… టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆయన నివాసం వైపుకు దూసుకువచ్చారు. పట్టణ బహిష్కరణ ఉన్న నేత తాడిపత్రిలో ఎలా ప్రవేశించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. అయితే టీడీపీ నిరసనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తన అక్కడకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దా రెడ్డి అనుచరులు చేరుకోవడంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. తరువాత కాసేపటికే ఘర్షణలు మొదలయ్యాయి. వైసీపీ వర్గీయులు రాళ్లు విసరడంతో టీడీపీ వర్గీయులు ఎదురు దాడి చేశారు. ఈ దాడిలో వైసీపీ వర్గీయుడు అడ్డు రఫీ గాయపడ్డారు.
పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇదే సమయంలో పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళుతున్న వైసీపీ నాయకుడు కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి… టీడీపీ వర్గీయులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో వారు నేరుగా పుట్లూరు రోడ్డులోని ఆయన ఇంటిపైకి వెళ్లి దాడికి దిగారు. ఇంట్లో ఫర్నిచర్‌తో పాటు బయట నిలిపి ఉంచిన రెండు కార్లు, స్కూటర్‌ను ధ్వంసం చేశారు.
జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతంలో ఘర్షణలు చెలరేగడంతో ఎస్పీ జగదీశ్ వెంటనే తాడిపత్రికి చేరుకున్నారు. ఘటన గురించి పోలీసు స్టేషన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుచేయాలని సూచించారు. ఘర్షణల నేపథ్యంలో ఎమ్మెల్యే జేసీ అశ్మిత్‌రెడ్డి నివాసం, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం, వైసీపీ నేత కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి నివాసాల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Tadipatri – ఓ ప్రముఖ ఛానెల్ రిపోర్టర్ కు కందిగోపుల బెదిరింపులు
తాడిపత్రిలో ఘర్షణను కవర్ చేస్తున్న ఓ ప్రముఖ ఛానెల్ (ఏబీఎన్-ఆంధ్రజ్యోతి) రిపోర్టర్ రమణను కందిగోపుల మురళి బెదిరించారు. ‘నువ్వెందుకు వచ్చావ్..? బయటకు వెళ్లకపోతే గన్‌తో కాల్చిపారేస్తా..’ అని గన్ బయటకు తీసి బెదిరించారు. ఈ తతంగమంతా పోలీసుల సమక్షంలో జరగడం గమనార్హం. దీనితో మురళీప్రసాద్‌రెడ్డి తనను గన్ తో బెదిరించారని, దుర్భాషలాడారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ కు రమణ ఫిర్యాదు చేశారు.
Also Read : Nara Chandrababu Naidu: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకి భారీ ఊరట !