TDP: ఒంటిమిట్ట, పులివెందులలో టీడీపీ ఘన విజయం
ఒంటిమిట్ట, పులివెందులలో టీడీపీ ఘన విజయం
TDP : పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకు ఘోర పరాభవం ఎదురైంది. గురువారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ఫలితాల్లో టీడీపీ (TDP) అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్ధి హేమంత్‌రెడ్డిపై… ఆమె 6,035 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డికి కేవలం 683 ఓట్లు లభించడంతో డిపాజిట్ కూడా కోల్పోయారు. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి టీడీపీ (TDP), వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 11 మంది పోటీపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్ నమోదైంది.
టీడీపీ (TDP) అభ్యర్థిని మారెడ్డి లతారెడ్డిని మంత్రి సవిత అభినందించారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందే పులివెందులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్దలు కొడతామన్నారు. ఈ విజయం కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
TDP – ఒంటిమిట్టలో టీడీపీ విజయం
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికలో ముద్దుకృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా. .. వైసీపీ (YCP) అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీనితో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచింది – మారెడ్డి లతారెడ్డి
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘనవిజయం సాధించారు. 6,050 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఈ సందర్భంగా లతారెడ్డి మీడియాతో మాట్లాడారు. పులివెందులలో న్యాయం, ధర్మం గెలిచిందని ఉద్ఘాటించారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్నినిలబెట్టుకుంటామని చెప్పుకొచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా ఒడిస్తామని మారెడ్డి లతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సుమారు మూడు దశాబ్దాల తరువాత పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యం యొక్క రుచిని చూసారని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబం యొక్క నియంతృత్వ ధోరణికి మూడు దశాబ్దాల పాటు నామినేషన్ వేయడానికి కూడా భయపడిన పులివెందుల ప్రజలు నేడు స్వేచ్ఛగా ఓటు వేసి టీడీపీని గెలిపించారన్నారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకమే పులివెందుల విజయమని ఉద్ఘాటించారు. ఇది జగన్ యొక్క నియంతృత్వ ధోరణికి చెంప దెబ్బ అని అన్నారు. తమ అభ్యర్ధికి డిపాజిట్ కూడా రాకపోవడంతో… వైసీపీ నేతలు పోలీసులను తప్పుబట్టడం సరికాదని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు నాయుడు వయసును కూడా గౌరవించకుండా జగన్ నోటి దురుసుతనంగా వ్యవహారించడం వైసీపీ విష సంస్కృతికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని, విలువను పెంచారని ఉద్ఘాటించారు. తనకు పోలీసులు రక్షణ పెంచమని ఓ వైపు కోరుతూనే… మరోవైపు పోలీసులపై నమ్మకం లేదని ధూషించటం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలపై వైసీపీ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీ దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో, ఒంటిమిట్టలోని 30 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రీ పోలింగ్ అంశంపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని, ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read : IMD: కోస్తాంధ్ర, యానాంకు ఆకస్మిక వరద ముప్పు ?
