Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి ! గాల్లోకి కాల్పులు జరిపిన గన్‌మెన్ !
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి ! గాల్లోకి కాల్పులు జరిపిన గన్‌మెన్ !
Teenmar Mallanna : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) కార్యాలయంపై దాడి జరిగింది. ఎమ్మెల్సీ కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ బీఆర్ఎస్, తెలంగాణా జాగృతి అభిమానులు, కార్యకర్తలు మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) కార్యాలయంలో చొరబడ్డారు. కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.
Teenmar Mallanna Office Attacked
స్థానికుల సమాచారంతో మల్లన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు… పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్ నుంచి పంపించివేశారు. ఈ ఘటనలో జాగృతి కార్యకర్త సాయికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీనితో అతన్ని రామ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని మల్కాజిగిరి డీసీపీ పద్మజ తెలిపారు. దీనికి సంబంధించి ఇంకా తమకు ఫిర్యాదు అందలేదన్నారు. ఫిర్యాదు వస్తే… సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు.
Also Read : Sonali Mishra: ఆర్పీఎఫ్ తొలి మహిళా సారధిగా సోనాలి మిశ్రా
