Telangana Cabinet: బీసీ రిజర్వేషన్లపై హాస్తినలో ఆందోళనకు సిద్ధం

బీసీ రిజర్వేషన్లపై హాస్తినలో ఆందోళనకు సిద్ధం

Telangana Cabinet : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై దిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం సీఎం, మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఆగస్టు 5, 6, 7 తేదీల్లో దిల్లీకి తరలివెళ్లాలని తీర్మానించింది. రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని, సానుకూల స్పందన రాకుంటే కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ సిద్ధం చేసింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet) వివరాలను మంత్రులు పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), వాకిటి శ్రీహరి, కొండా సురేఖ వెల్లడించారు.

Telangana Cabinet Protest

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. శాసనసభలో బిల్లులకు మద్దతు తెలిపిన భాజపా నాయకులు ఇప్పుడు మోకాలడ్డుతున్నారని, కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ సీఎం, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలు అడుగుతున్నారని, మూడు రోజుల కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కలిసి దిల్లీ వెళ్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం చేస్తున్న పోరాటానికి బీసీ మేధావులు, సంఘాలు, రిజర్వేషన్లు కోరుకుంటున్నవారంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లతో 50 శాతం పరిమితి దాటిపోయిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ పార్టీ సామ, దాన, భేద, దండోపాయాల పద్ధతిలో ముందుకువెళ్తుందని, కేంద్రం సానుకూలంగా స్పందించకుంటే నిరసన తెలియజేస్తామని వారు పేర్కొన్నారు.

Telangana Cabinet – బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం

‘‘రాష్ట్రంలో బీసీలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. కామారెడ్డి డిక్లరేషన్‌ నుంచి ఆర్డినెన్సు వరకు వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది మార్చి 17న ప్రభుత్వం రెండు బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించింది కాగా… మరొకటి విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేది. వీటిని అన్ని రాజకీయ పార్టీల సహకారంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదింపజేశారు. బిల్లులను మార్చి 22న గవర్నర్‌కు పంపించగా… వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం ఆయన మార్చి 30న పంపించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు, మద్రాస్‌ హైకోర్టు తీర్పులను పరిశీలిస్తున్నాం. గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. తెలంగాణ ఏర్పాటైన తరువాత అప్పటి సీఎం కేసీఆర్‌.. 2018 పంచాయతీ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతంలోపు ఉండాలన్న నిబంధన చేర్చారు. దాన్ని సవరిస్తూ 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ జులై 10న మా ప్రభుత్వం ఆర్డినెన్సు ముసాయిదా జారీ చేసింది. దాన్ని గవర్నర్‌కు జులై 14న పంపించాం.

ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్పింది

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గడువు విధించింది. మరోవైపు కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు రావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని బిల్లులను ఆమోదింపజేయాలని కోరుతున్నాం. భాజపా కార్యకర్తలతో పాటు ఆ పార్టీకి చెందిన బీసీ ఎంపీలు అర్వింద్, బండి సంజయ్, ఈటల రాజేందర్, ఆర్‌.కృష్ణయ్య, లక్ష్మణ్‌ కలిసి రాష్ట్రపతి వద్ద బిల్లులను ఆమోదింపజేయాలి. బీసీ రిజర్వేషన్లకు (BC Reservations) వ్యతిరేకంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. శాసనసభలో బిల్లులకు భాజపా సహకరించింది. ఇప్పుడు కాదంటోంది. బిల్లులకు సహకరించేందుకు వీలుకాకుంటే రాజీనామా చేయాలి’’ అని మంత్రులు డిమాండ్‌ చేశారు.

రాష్ట్రపతికి చేరిన ఆర్డినెన్స్‌ ముసాయిదా!

స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తూ మంత్రివర్గం సిఫార్సు చేసిన ఆర్డినెన్స్‌ ముసాయిదాను గవర్నర్‌ గత శనివారం రాష్ట్రపతికి పంపినట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం… స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినపుడు ఆర్డినెన్స్‌ ముసాయిదాను గవర్నర్‌ శనివారం రాష్ట్రపతి పరిశీలనకు పంపించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై సుదీర్ఘ చర్చ అనంతరం… ముఖ్యమంత్రి, మంత్రులు సహా అధికార పార్టీ ప్రజాప్రతినిధులందరూ మూడు రోజుల పాటు దిల్లీలో మకాం వేసి రాష్ట్రపతిని కలిసి ఆమోదం తెలపాలని కోరాలని, ఇతరత్రా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై 90 రోజుల్లోపు ఏదో ఒక నిర్ణయం వెలువరించకపోతే ఆమోదం తెలిపినట్లుగానే భావించాల్సి ఉంటుందని ఇటీవల తమిళనాడుకు సంబంధించిన బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. అయితే అది ఆ కేసు వరకే పరిమితమన్న అంశం తీర్పులో ఉందని అధికారులు చెప్పినట్లు తెలిసింది. న్యాయశాఖ అధికారులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్‌ (BC Reservations) బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటం, తాజాగా ఆర్డినెన్స్‌ ముసాయిదాను కూడా గవర్నర్‌ పంపినట్లు సమాచారం అందడంతో సీఎం, మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా దిల్లీకి వెళ్లి ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆగస్టు 5న బీసీ రిజర్వేషన్‌ బిల్లుల ఆమోదంలో జాప్యానికి నిరసనగా పార్టీ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇప్పించాలని, 6న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయాలని, 7న ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజాప్రతినిధులందరూ రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం వినతిపత్రం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల రద్దు

రాష్ట్రంలో ఉన్న రవాణాశాఖ అంతర్రాష్ట చెక్‌పోస్టులను రద్దుచేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 15 చెక్‌పోస్టులున్నాయి. జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా వాటిని తొలగించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. చెక్‌పోస్టుల సిబ్బంది ద్వారా కాకుండా ఇకపై వాహన్, అడ్వాన్స్డ్‌ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగనుంది. కోర్‌ తెలంగాణ అర్బన్‌ సిటీతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లలో మైక్రోబ్రూవరీస్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మైక్రోబ్రూవరీస్‌ చట్టానికి పలు సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read : Telangana High Court: హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

Leave A Reply

Your Email Id will not be published!