Telangana Govt : సోమవారం అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్
రేపు సాయంత్రం వరకు ప్రజలు బయటకు రావొద్దని సూచించారు...
Telangana Govt : తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రేపు (సెప్టెంబర్ 2) రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు . అలాగే అన్ని ప్రభుత్వ విభాగాలకు సెలవు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులతోపాటు మంత్రులు కూడా 24 గంటలపాటు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయన్నారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోతే.. ఆ మార్గాల్లో వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. హైవేలపై వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
Telangana Govt Order..
రేపు సాయంత్రం వరకు ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలించినట్లు తెలిపారు. హైదరాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు మాత్రం సెలవు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లకు ఆయా స్థానిక పరిస్థితులను బట్టి సెలవు ప్రకటించాలా లేదా అనేది ఆయా జిల్లాల కలెక్టర్లు సమీక్షించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా తెలంగాణ(Telangana) రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి. ఈ క్రమంలో సెలవులు పెట్టిన వారంతా వెంటనే విధుల్లో చేరాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read : Minister Komatireddy : రెడ్ అలర్ట్ జిల్లాల్లో ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి