Telangana High Court: బీజేపీ ఎంపీ ఈటెలకు హైకోర్టులో చుక్కెదురు
బీజేపీ ఎంపీ ఈటెలకు హైకోర్టులో చుక్కెదురు
బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన కేసును కొట్టేయాలని ఆయన చేసిన అభ్యర్థన పిటిషన్ ను గురువారం న్యాయస్థానం కొట్టేసింది. ఘట్‌కేసర్ లోని కొర్రెములలో శ్రీహర్ష కన్‌స్ట్రక్షన్ సెక్యూరిటీ గార్డుపై ఈటెల రాజేందర్ చేయి చేసుకున్నారని అభియోగం ఉంది. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఈటలపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
అయితే కేసులో ప్రాథమిక ఆధారాలున్నందునే పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ దశలో కేసును కొట్టేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం… ఈటలపై నమోదైన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. కేసు గురించి కింది కోర్టులోనే తేల్చుకోవాలని ఈటెలకు సూచిస్తూ పిటిషన్ ను కొట్టేసింది.
అసలేం జరిగిందంటే ?
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ లో కొన్ని రోజుల క్రితం ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేదల భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు ఎంపీకి విన్నవించారు. దీనితో ఆగ్రహించిన ఎంపీ రాజేందర్… స్థిరాస్తి వ్యాపారిపై దాడి చేశాడు. ఇదే సమయంలో ఎంపీ అనుచరులు, బాధితులు సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఈటల బ్రోకర్లపై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనితో సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.