Telangana High Court: విమాన ఇంధనంలో కల్తీపై హైకోర్టు ఆగ్రహం
విమాన ఇంధనంలో కల్తీపై హైకోర్టు ఆగ్రహం
Telangana High Court : విమాన ఇంధనాన్ని కల్తీ చేయడంపై హైకోర్టు (Telangana High Court) మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. పెట్రోల్ లో కల్తీ జరిగితే రోడ్డుపై వెళ్లే వాహనాలు కేవలం ఆగిపోతాయని, గాలిలో వెళ్తున్న విమానాలు కూలిపోతాయని పేర్కొంది. మనుషుల ప్రాణాలకు విలువ లేదా ? మానవత్వం లేదా అంటూ ప్రశ్నించింది. కాంట్రాక్టును పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్‌ను రూ.10 లక్షల జరిమానా విధిస్తూ కొట్టివేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Telangana High Court Serious
ట్యాంకర్లలో ఇంధనాన్ని కల్తీ చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టును రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన పి.గురునాధం హైకోర్టులో (Telangana High Court) పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… ఆయిల్ ట్యాంకర్ వెళ్తుండగా ఏదో శబ్దం వస్తుండటంతో నిలిపి పైకెక్కి చూశారన్నారు. దీన్ని కొందరు వీడియోలు తీసి ఇంధనంలో కల్తీ చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్నారు. డ్రైవర్లు రెండు నిమిషాలు మాత్రమే వాహనాన్ని ఆపారని, కల్తీపై ఎలాంటి దర్యాప్తు జరపకుండా, వాస్తవాలను నిర్ధారించకుండా కాంట్రాక్టును రద్దు చేయడంతోపాటు డిపాజిట్‌ను జప్తు చేశారన్నారు. దీనిపై న్యాయమూర్తి విభేదిస్తూ… విమాన ఇంధనంలో కల్తీతో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో తెలియదా అంటూ ప్రశ్నించారు. పిటిషనర్ సరఫరా చేసిన ఇంధనం వినియోగిస్తున్న విమానంలో ఆయన ప్రయాణిస్తారా అని అడిగారు. టెండరు రద్దు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ రూ.10 లక్షల జరిమానా విధిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.
Telangana High Court – ఏపీపీల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వండి – హైకోర్టు
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల(ఏపీపీ) నియామక నోటిఫికేషన్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏపీపీ పోస్టులను భర్తీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన బి.శ్రీనివాసులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 118 ఏపీపీ పోస్టుల నియామకానికి ఆర్థికశాఖ ఆమోదం లభించిందని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నామని తెలిపారు. దీన్ని నమోదు చేసి పిటిషన్‌పై విచారణ మూసివేస్తామని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ తరఫు న్యాయవాది మాత్రం విచారణను కొనసాగించాలని కోరారు. సుమారు 262 పోస్టులు ఖాళీగా ఉండగా 118 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తున్నామని చెబుతున్నారన్నారు. గతంలో కూడా ఇలాగే పలుమార్లు ఇస్తున్నామని చెప్పి ఇవ్వలేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం నోటిఫికేషన్‌ను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వారానికి వాయిదా వేసింది.
Also Read : Green Channel: మెట్రో రైలులో గ్రీన్ చానల్ ! గుండె, ఊపిరితిత్తుల తరలింపు !
