Telangana Lawyers: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన న్యాయవాదుల అరెస్టు

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన న్యాయవాదుల అరెస్టు

Telangana Lawyers : సీనియర్‌ న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్‌ (56) దారుణ హత్యకు నిరసనగా న్యాయవాదులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. న్యాయవాది ఇజ్రాయిల్ హత్యకు(Israel) నిరసనగా అడ్వేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీనితో అసెంబ్లీ వైపు దూసుకువెళుతున్నన్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, న్యాయవాదుల మధ్య తోపులాట జరిగింది. గన్‌ పార్క్ వద్ద న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా సోమవారం చంపాపేటలోని న్యాయవాది ఎర్రబాపు ఇజ్రాయెల్‌ ను అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది.

Telangana Lawyers – హైకోర్టులో విధుల బహిష్కరణ

మరోవైపు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు(Telangana Lawyers) తమ విధులను బహిష్కరించి నిరసలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి న్యాయవాదులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎర్రబాపు ఇజ్రాయెల్‌ అనే న్యాయవాదిని ప్రత్యర్థి కక్షిదారు హత్య చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ఇందుకు నిరసనగా మంగళవారం హైకోర్టు(High Court)లో విధులు బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. అయితే హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది.

మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన సీనియర్‌ న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్‌ (56) నగరంలోని చంపాపేట డివిజన్‌ న్యూమారుతీనగర్‌ కాలనీలో నివసిస్తున్నాడు. తన ఇంటి సమీపంలోనే ఓ అపార్ట్‌ మెంట్‌లో ఇటీవల ఫ్లాట్‌ను కొనుగోలు చేసి… ఓ గృహిణి కుటుంబ సభ్యులకు అద్దెకు ఇచ్చాడు. అదే కాలనీ సమీపంలోని సుల్తానా అల్వా కాలనీ శ్మశాన వాటిక కాపలాదారుడుగా పని చేస్తున్న గులాం దస్తగిరి ఖాళీ సమయంలో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా కూడా పనిచేస్తున్నాడు. ఇజ్రాయిల్‌ కొనుగోలు చేసిన ఫ్లాట్‌లో దస్తగిరి విద్యుత్‌ మరమ్మతు పనులకు వెళ్తుండే వాడు. ఈ క్రమంలోనే ఫ్లాట్‌ లో అద్దెకు ఉంటున్న గృహిణితో పరిచయం ఏర్పడింది. దీన్ని అలుసుగా తీసుకున్న దస్తగిరి తనను ప్రేమించాలని, అండగా ఉంటానని ఆమెను వేధించసాగాడు. వేధింపులు భరించలేని ఆ గృహిణి ఫ్లాట్‌ యజమాని ఇజ్రాయిల్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన దస్తగిరిని మందలించాడు.

దస్తగిరి వేధింపులు ఎక్కువ అవడంతో 25 రోజుల క్రితం ఇజ్రాయిల్‌ ఐఎస్‌సదన్‌ పోలీసులకు గృహిణితో ఫిర్యాదు చేయించాడు. ఆమెకు దస్తగిరి నుంచి ప్రాణహాని ఉందని హెచ్చరించాడు. ఆమెను బంధువుల ఇంటికి పంపించి వేశాడు. ఈ క్రమంలో పోలీసులు దస్తగిరిని స్టేషన్‌కు పిలిపించి… మందలించి, కౌన్సిలింగ్‌ చేసి పంపించేశారు. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన దస్తగిరి… ఇజ్రాయిల్‌ పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. గత మూడు రోజులుగా ఇజ్రాయిల్‌ ఇంటి ముందు రెక్కీ నిర్వహించిన దస్తగిరి సోమవారం ఉదయం 9 గంటలకు ఇజ్రాయిల్‌ తన స్కూటీపై ఒంటరిగా రావటాన్ని పసిగట్టి.. ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

విషయం తెలసుకున్న స్థానికులు రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయిల్‌ను సమీపంలోని డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు ఇజ్రాయిల్‌ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా పోలీసులు గృహిణి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదని, తీసుకుని ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. కాగా ఇజ్రాయిల్‌ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర మాజీ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు.

Also Read : Karnataka Honeytrap: కర్ణాటక హనీట్రాప్ పై సుప్రీంలో పిల్‌

Leave A Reply

Your Email Id will not be published!