Telangana MLC: ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
Telangana MLC : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాలకు కాంగ్రెస్(Congress) అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో విడుదల చేసారు. అయితే ఎమ్మెల్సీగా విజయశాంతి పేరును ఖరారు చేయడం ఆసక్తికరంగా మారింది. విజయశాంతి పేరు పరిగణనలో ఉన్నట్టు ఇప్పటివరకు వార్తలు కూడా రాలేదు. ఊహించని పేరు తెర పైకి రావడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
Telangana MLC Candidates
ఎమ్మెల్యేల కోటా నుంచి ఐదు ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా మూడు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్ఎస్ కు వస్తాయి. ఐదో స్థానం కోసం ఎంఐఎంతోపాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు ఓట్లు వేస్తే కాంగ్రెస్‌కు నాలుగో సీటు లభించే అవకాశమున్నా, సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని సీపీఐ కోరింది. సీపీఐ అగ్ర నాయకత్వం కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మాట్లాడారు. దీంతో ఆ పార్టీకి ఒక స్థానం కేటాయించారు. అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే సీపీఐ రాష్ట్ర కార్యవర్గం చర్చిస్తోంది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఆశావహుల్లో నెల్లికంటి సత్యం యాదవ్, చాడ వెంకటరెడ్డి ఉన్నారు. ఇవాళ రాత్రిలోపు సీపీఐ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది.
Also Read : Telangana Government: చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్