Telangana Police: విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ ! హెచ్‌సీయూ వద్ద తీవ్ర ఉద్రి‍క్తత !

విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ ! హెచ్‌సీయూ వద్ద తీవ్ర ఉద్రి‍క్తత !

Telangana Police : కంచ గచ్చిబౌలి భూముల అమ్మకానికి సిద్ధమైన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్ధులు చేపట్టిన ధర్నా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. భూముల అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌(Hyderabad) సెంట్రల్‌ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద నిరసన చేపడుతున్న విద్యార్ధులపై… పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు. దీనితో ఒక్కసారిగా అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నిరసన చేస్తున్న విద్యార్ధులను చెదరగొడుతూ… వారిపై లాఠీలను ఝులిపించారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి… వివిధ పోలీసు స్టేషన్లనకు తరలించారు.

దీనితో హెచ్‌సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. యూనివర్సిటీ చుట్టూ అన్ని గేట్ల వద్ద పోలీసులు మోహరించారు. అనంతరం, ఉద్యోగులను, విద్యార్థులను మాత్రమే యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. డ్రోన్లు ఎగురవేసి వీడియోలు తీసిన ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు… యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి యూనివర్సిటీకి బీజేపీ మహిళా మోర్చా నాయకులు వచ్చారు. దీనితో వారిని పోలీసులు అడ్డుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు నాలుగో రోజు ఆందోళనలు తెలుపుతున్నారు. అక్కడున్న 400 ఎకరాలను యూనివర్సిటీకి అప్పగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Telangana Police – కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సీఎం అత్యవసర సమావేశం

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూవివాదంపై అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అత్యవసరంగా సమావేశమయ్యారు. దీనికి ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తదితరులతో పాటు రెవెన్యూ, అటవీ, పరిశ్రమల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. 1975లో హైదరాబాద్‌(Hyderabad) కేంద్రీయ విశ్వవిద్యాలయానికి(హెచ్‌సీయూ) జరిపిన భూ కేటాయింపుల నుంచి ఇప్పటివరకూ జరిగిన పూర్తి ప్రక్రియను సీఎంకు, మంత్రులకు అధికారులు వివరించారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదేనని వారు స్పష్టం చేశారు.

‘‘1975లో హెచ్‌సీయూకు కంచ గచ్చిబౌలిలో భూమి కేటాయించారు. అయితే భూ యాజమాన్య హక్కులు బదిలీ చేయలేదు. రెవెన్యూ, అటవీ రికార్డుల ప్రకారం… సర్వే నంబరు 25లోని భూమిని ఎప్పుడూ అటవీ భూమిగా వర్గీకరించలేదు. 2003 ఆగస్టు 9న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘ఐఎంజీ అకాడమీస్‌ భారత’తో ఒప్పందం కుదుర్చుకుంది. 2004 ఫిబ్రవరి 3న హెచ్‌సీయూ నుంచి 400 ఎకరాలను ఆ సంస్థకు అప్పగించింది. అందుకు బదులుగా గోపనపల్లిలోని సర్వే నంబర్లు 36, 37లలోని 397 ఎకరాలను హెచ్‌సీయూకు బదలాయించింది. ఐఎంజీ భారతకు భూ కేటాయింపులను 2006 నవంబరు 21న అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది.

దీనిపై ఐఎంజీ హైకోర్టుకు వెళ్లగా… ఉన్నత న్యాయస్థానం 2024 మార్చి 7న ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ భూమి ఎన్నడూ హెచ్‌సీయూలో అంతర్భాగం కాదు. ఎప్పుడూ అటవీ ప్రాంతంగా పరిగణించలేదు. హైకోర్టు తీర్పు అనంతరం టీజీఐఐసీ అభ్యర్థన మేరకు ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమే. ఇక్కడ భారీ పెట్టుబడులకు అవకాశం కల్పించడం వల్ల సుమారు 5 లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా’’ అని ఉన్నతాధికారులు వివరించారు.

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని మంత్రులు ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. అనంతరం ఈ భూములపై నెలకొన్న అపోహలను తొలగించేలా తక్షణం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

Also Read : CM Revanth Reddy: ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువును పొడిగించిన రేవంత్ సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!