Telugu Students: భారత్-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతతో స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు

భారత్-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతతో స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు

Telugu Students : ఆపరేషన్ సిందూర్ తో భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంజాబ్, జమ్ముకశ్మీర్‌ లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు(Telugu Students) వెనక్కి వచ్చేస్తున్నారు. శుక్రవారం రాత్రి పంజాబ్‌ లో బ్లాక్ ఔట్ ఇచ్చారు. యూనివర్సిటీలను టార్గెట్ చేసినట్టు అనుమానం రావడంతో… వెంటనే వెళ్లిపోవాలని కాలేజీ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది. దీనితో జమ్ముకాశ్మీర్, పంజాబ్ నుంచి సుమారు 70 మంది తెలుగు విద్యార్థులు(Telugu Students) ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఒక్క పంజాబ్ కు చెందిన లవ్లీ యూనివర్సిటీలోనే దాదాపు 2వేల మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారంతా కూడా స్వస్థలాలకు చేరుకోవడానికి పయనమయ్యారు.

ఈ సందర్భంగా ఢిల్లీకి వచ్చిన పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వలూలో మాట్లాడుతూ… ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌ గత రెండు రోజులుగా డ్రోన్‌ ఎటాక్స్ చేస్తోందని.. ఆ డ్రోన్స్ అన్నీ తమ యూనివర్సిటీపై నుంచి వెళ్లాయన్నారు. డ్రోన్స్‌ను చూసిన యూనివర్సిటీ యాజమానం మమ్మల్ని వెంటనే వెళ్లిపోవాలని చెప్పారన్నారు. అమృత్‌సర్, జలంధర్‌ లాంటి సున్నితమైన ప్రదేశాల్లో బ్లాక్‌ ఔట్‌, రెడ్ అలర్ట్‌లు జారీ చేసినట్లు తెలిపారు. దీనితో మేము చాలా ఇబ్బంది పడ్డామన్నారు. డ్రోన్స్‌ వల్ల ఎలాంటి విధ్వంసం జరగలేదని… పాకిస్థాన్ వేసిన డ్రోన్లను భారత్‌ అడ్డుకుందని విద్యార్థులు చెప్పారు.

కాగా.. భారత్ – పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ముకశ్మీర్(Jammu Kashmir), పంజాబ్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులను త్వరితగతిన వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లలో టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు పెద్ద ఎత్తున కాల్స్ వస్తున్నాయి. జమ్ము కాశ్మీర్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు(Telugu Students) కాల్స్‌ చేస్తున్న పరిస్థితి. పంజాబ్, జమ్ములో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులను రోడ్డు మార్గంలో ఢిల్లీకి చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వారిని స్వస్థలాలకు తరలించనున్నారు. ఇక జమ్ము, పంజాబ్‌ రాష్ట్రాల్లో అర్ధరాత్రి వేళల్లో ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుండగా… ఉదయం సేఫ్ జోన్‌ గానే ఉంటోంది. అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులను బస్సుల్లో, ఇతర వాహనాల్లో వారి వారి స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా కాలేజీ యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులను ఢిల్లీలోని తెలంగాణ, ఏపీ భవన్లకు తరలిస్తుండగా.. మరికొంతమందిని నేరుగా వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telugu Students – స్టూడెంట్స్‌ కోసం టోల్‌ ఫ్రీ నెంబర్స్ – గౌరవ్ ఉప్పల్

తెలంగాణ భవన్‌ లో ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశామని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir), పంజాబ్ ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక్క లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 2500 మందికిపైగా తెలంగాణ వారు ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. పంజాబ్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఢిల్లీ తెలంగాణ భవన్‌లో అకామిడేషన్‌ ను అధికారులు ఏర్పాటు చేశారు. తిరిగి వారిని స్వస్థలాలకు పంపేందుకు తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇందులో 300 మందికిపైగా విద్యార్థులు ఉండగా… వీరిలో పలువురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. సరిహద్దుల్లో బాంబుల మోతతో ఆందోళన చెందుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. తమను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఏపీ, తెలంగాణ విద్యార్థులు లేఖ రాశారు. దీనితో కేంద్ర మంత్రి తక్షణమే స్పందించారు. జిల్లా కలెక్టర్, వర్శిటీ డీన్‌తో మాట్లాడారు. సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరారు. దీనితో ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన మొత్తం 23 మంది విద్యార్థులను బస్సుల్లో శ్రీనగర్‌ నుంచి దిల్లీకి పంపించారు. అక్కడి నుంచి స్వస్థలాలకు చేరుకోనున్నారు.

కాల్పుల విరమణ ప్రకటన శుభపరిణామం – సీఎం చంద్రబాబు

భారత్‌- పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ప్రకటన శుభపరిణామమని ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉద్రిక్తతల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో సంతాపం వ్యక్తం చేశారు. దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు తెలపాలని… దేశమే ముందు అనేది అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు. దేశానికి కష్టమొస్తే సంఘటితంగా ఉండాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. ‘‘ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదం. దేశ రక్షణ కోసం జరిగిన వీరోచిత పోరాటంలో అగ్నివీర్‌ మురళీనాయక్ వీరమరణం పొందటం బాధాకరం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ.. ఎవరు మనపైకి వచ్చినా ఉపేక్షించేది లేదు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయభేదాలు ఉన్నా.. దేశ సమగ్రత విషయంలో అందరం ఏకతాటిపైకి రావడం గొప్ప విశేషం. మత విద్వేషాలు లేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్’’ అని చంద్రబాబు అన్నారు.

Also Read : Hyderabad Police: శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు పరిధిలో డ్రోన్లపై నిషేధం

Leave A Reply

Your Email Id will not be published!