Visakha Metro: విశాఖ మెట్రో టెండర్లకు శ్రీకారం ! మూడు కారిడార్లలో 46.23 కిలోమీటర్లు !

విశాఖ మెట్రో టెండర్లకు శ్రీకారం ! మూడు కారిడార్లలో 46.23 కిలోమీటర్లు !

Visakha Metro : ఏపీలో ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టు ఎట్టకేలకు గాడిలో పడుతోంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (AMRC) మెట్రో నిర్మాణానికి సంబంధించిన టెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్రధాన కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ఈ టెండర్లు పెట్టినట్లు అధికారులు తెలిపారు.

అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకారం, విశాఖ మెట్రోకు (Visakha Metro) సంబంధించి మొత్తం మూడు కారిడార్లు రూపొందించారు. ఈ మూడు కారిడార్లలో కలిపి మొత్తం 42 మెట్రోస్టేషన్లను నిర్మించనున్నట్లు AMRC వెల్లడించింది. ప్రతి స్టేషన్ను ఆధునిక సదుపాయాలతో, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మించనుంది. ఈ మెట్రో ప్రాజెక్టును మూడు ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ దశలో టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఈ మెట్రో ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విశాఖపట్నం నగరం ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం పొందడంతోపాటు, మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయని నగర ప్రణాళిక వర్గాలు భావిస్తున్నాయి. మెట్రో రాకతో రియల్ ఎస్టేట్, వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా అభివృద్ధి చెందనున్నాయి.

Visakha Metro – మెట్రో ప్రాజెక్టులకు రెండు కన్సల్టెన్సీలతో ఒప్పందం

విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు నిధుల కేటాయింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో దానికి సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. మెట్రో ప్రాజెక్టు, పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై కన్సల్టెన్సీలతో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి నారాయణ సమక్షంలో ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విశాఖ, విజయవాడ మెట్రో మొదటి దశ పనుల్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. విశాఖ మెట్రో ఫేజ్‌ 1లో భాగంగా 46.23 కి.మీ పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఫేజ్‌ 2లో మరో 30 కి.మీ ఉంటుందన్నారు. విజయవాడ మెట్రోకు రెండు రోజుల్లో టెండర్లు పిలుస్తామని తెలిపారు.

Also Read : CM Chandrababu: 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!