Terrorist Suleman: ‘ఆపరేషన్ మహాదేవ్’ లో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం
‘ఆపరేషన్ మహాదేవ్’ లో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం
Terrorist Suleman : జమ్మూ కశ్మీర్ లో సైన్యం భారీ విజయం సాధించింది. ‘ఆపరేషన్ మహాదేవ్’ తో ముగ్గురు కీలక ఉగ్రవాదులను అంతమొందించింది. వీరిలో పహల్గాం ఉగ్ర దాడికి కుట్ర పన్నిన సులేమాన్ ఉన్నట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ శివార్లలో ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ‘ఆపరేషన్ మహాదేవ్’ (Operation Mahadev) పేరుతో సైన్యానికి చెందిన ఎలైట్ పారాకమాండోలు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పహల్గాం ఉగ్ర దాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ (Terrorist Suleman) అలియాస్ ఆసిఫ్‌తోపాటు అతడి ఇద్దరు అనుచరులు హతమయ్యారు.
Terrorist Suleman Killed
భద్రతా దళాలు అంతమొందించిన ఉగ్రవాదుల్లో గత ఏడాది సోనామార్గ్ టన్నెల్ పేల్చివేతలో పాల్గొన్న జిబ్రాన్ ఉన్నాడు. మరో ఉగ్రవాదిని హమ్జా అఫ్గానీగా గుర్తించారు. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్‌ను ఉపయోగించడంతో భద్రతా దళాలు.. వారి ఉనికిని పసిగట్టాయి. అలాంటి ఫోన్‌నే పహల్గాం ఉగ్ర దాడి సందర్భంగా వినియోగించారు.
దీనితో వెంటనే స్పందించిన పారాకమాండోలు మెరుపు దాడి చేసి ముష్కరులను హతమార్చారు. ముల్నార్ గ్రామ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో ఒక ఎం4 కార్బైన్ రైఫిల్, ఇతర ఆయుధ సామగ్రి లభించాయి. ఉదయం 11.30 గంటల సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్ సభ్యులు, 4వ పారా యూనిట్ సిబ్బంది.. ముగ్గురు ఉగ్రవాదుల ఉనికిని గుర్తించారని, సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ముగ్గురు ముష్కరుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ జోన్ ఐజీ వీకే బిర్డి తెలిపారు. ఆ ప్రాంతంలో మరో ఉగ్ర గ్రూపు ఉందనే నిఘా వర్గాల సమాచారంతో సైనిక బలగాలు గాలింపు చేపట్టాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడి చేసి బీభత్సం సృష్టించిన ఘటనకు సులేమాన్ (Terrorist Suleman) సూత్రధారిగా భావిస్తున్నారు. ఈ ఘటనలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. తాజాగా పహల్గాం ఉగ్ర దాడికి సూత్రధారిని అంతమొందించి ప్రతీకారం తీర్చుకుంది. గత ఏడాది అక్టోబరులో సోనామార్గ్ టన్నెల్ పేల్చివేతలో ఏడుగురు మరణించారు. అందులో ఒక వైద్యుడు ఉన్నారు.
ఎవరీ సులేమాన్ ?
జమ్మూ కశ్మీర్లో హతమైన పహల్గాం ఉగ్ర దాడి సూత్రధారి సులేమాన్‌కు హషీం మూసా అనే పేరుంది. అతడు గతంలో పాకిస్థాన్ సైన్యంలో పని చేశాడు. ఆ తరువాత లష్కరే తయ్యిబాతో అనుబంధం ఏర్పరుచుకున్నాడు. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.20లక్షల రివార్డును జమ్మూ కశ్మీర్ పోలీసులు ప్రకటించారు. పహల్గాం దాడి తర్వాత మధ్య కశ్మీర్‌లోని గండేర్బల్లో సులేమాన్ షా తలదాచుకున్నాడు.
ప్రధాని విశ్వగురు అయితే పాక్‌ను ఎఫ్ఏటీఎఫ్ పరిధిలోకి తేవాలి – ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ప్రధాని మోదీ (PM Modi) నిజంగా విశ్వగురు అయితే పాకిస్థాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) పరిధిలోకి తీసుకురావాలని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. ఆయన జీ7 దేశాలు, జీసీసీలపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ పని పూర్తిచేసి తన సత్తా నిరూపించుకోవాలన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన పైలట్ల మాటలను పాకిస్థాన్ ఎలా విన్నది? మన కమ్యూనికేషన్ ఎన్క్రిప్టెడ్ కాదా? అని ప్రశ్నించారు. ‘భారత్‌కు చెందిన 5 యుద్ధవిమానాలు కూలిపోయాయన్న ట్రంప్ ప్రకటన అబద్ధమన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటనను నేను విశ్వసిస్తున్నాను. అలాగైతే మన పైలట్లను అభినందించాలని డిమాండ్ చేస్తే అదీ చేయడంలేదు. ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇవ్వకపోవడంవల్లే మన విమానాలకు నష్టం జరిగిందా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇకనైనా జాతీయభద్రత, విదేశాంగ విధానాన్ని రాజకీయాంశంగా మార్చొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని ఒవైసీ పేర్కొన్నారు.
Also Read : TCS: టీసీఎస్‌లో 12వేల ఉద్యోగాల కోత ?
