TG High Court: బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
TG High Court : బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు (TG High Court) కొట్టివేసింది. ఏ అంశాల ఆధారంగా పిటిషన్ వేశారని ప్రశ్నించింది. పిటిషనర్ అర్హతపై నిలదీసింది. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏదైనా కాపీ ఇచ్చిందా అని ప్రశ్నించింది. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఎలా పిటిషన్ వేస్తారని పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా వార్తల ఆధారంగా పిటిషన్లు వేయడం సరికాదంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికా వార్తలను పరిగణనలోకి తీసుకోలేమని పేర్కొంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమంటూ హైకోర్టులో (TG High Court) ఇటీవల పిటిషన్ దాఖలైంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏ ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వలు పిటిషన్ దాఖలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనతోపాటు అదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు. తద్వారా ఎన్నికల ప్రక్రియను, స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రిజర్వేషన్లు 50 శాతం దాటుతాయని ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అందువల్ల పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్లను కొట్టివేసింది.
TG High Court – గ్రూప్-1 అంశంలో సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టు స్టే
గ్రూప్-1 అంశంలో టీజీపీఎస్సీ (TGPSC) హైకోర్టులో (TG High Court) ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. గ్రూప్-1 నియామకాలు చేపట్టుకోవచ్చని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 15కి వాయిదా వేసింది. గ్రూప్-1 తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. మెయిన్స్ జవాబు పత్రాలను 8 నెలల్లో పునఃమూల్యాంకనం చేయించాలని.. లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. దీనిపై నేడు హైకోర్టులో (TG High Court) విచారణ జరిగింది.
పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను సింగిల్ బెంచ్ రద్దు చేసింది. మెయిన్స్ పత్రాలను పునఃమూల్యాంకనం చేయాలని ఆదేశించింది. 8 నెలల్లోపు చేయకపోతే మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని స్పష్టం చేసింది. 2011లో గ్రూప్-1 నిర్వహించారు. ఆ తర్వాత 2022లో నిర్వహిస్తే సుప్రీంకోర్టు రద్దు చేసింది. 14 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నియామకాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రక్రియను సింగిల్ బెంచ్ రద్దు చేసింది. తెలుగులో మెయిన్స్ జవాబులు రాసిన వారిపట్ల పక్షపాతం చూపించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు’’ అని కోర్టుకు ఏజీ తెలిపారు.
దీనిపై సీజే జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ స్పందిస్తూ మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్‌లాంటి ఘటనలు ఏమైనా చోటుచేసుకున్నాయా? పక్షపాతం చూపించారనడానికి ఏమైనా ఆధారాలున్నాయా?అని ఏజీని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని ఆయన తెలిపారు. ఏపీలో నిర్వహించిన గ్రూప్స్ పరీక్షల్లో తెలుగులో రాసిన అభ్యర్థులు తక్కువగా ఎంపికయ్యారని చెప్పారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో పురుషులకు వాష్‌రూమ్‌లు లేవని.. అందుకే ఆ రెండు కేంద్రాల్లో మహిళలకు మాత్రమే కేటాయించామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని వాళ్లకు సమీపంలోని కేంద్రాలు కేటాయించామన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడాన్ని సైతం తప్పుబట్టారని ఏజీ తెలిపారు. హాల్ టికెట్ల జారీ విషయంలో టీజీపీఎస్సీకి అధికారం ఉంటుందని.. పరీక్ష కేంద్రాల కేటాయింపును తప్పుబట్టలేమని సీజే అన్నారు. అనంతరం సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సీజే జస్టిస్ ఏకే సింగ్ స్పష్టం చేశారు. డివిజన్ బెంచ్ స్టే విధించడంతో గ్రూప్-1 ర్యాంకర్లకు ఊరట లభించింది.
Also Read : Rain Forecast: తెలంగాణలో ఈ నెల 30 వరకు భారీ వర్షాలు
