TG High Court: కేక్‌ కట్‌ చేయాల్సిన బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసింది – జస్టిస్‌ నగేశ్‌ భీమపాక

కేక్‌ కట్‌ చేయాల్సిన బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసింది - జస్టిస్‌ నగేశ్‌ భీమపాక

TG High Court : జీహెచ్‌ఎంసీలో లైసెన్స్‌ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచవద్దని తెలంగాణ హైకోర్టు (TG High Court) ఆదేశించింది. రామంతాపూర్‌ లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి కేబుల్‌ వైరు తగిలి ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనితో విద్యుత్ స్తంభాలపై కేబుల్‌ వైర్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారతి ఎయిర్‌టెల్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక మరోసారి విచారణ జరిపారు.

TG High Court Shocking for Sahasra Murder

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటంపై న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామంతాపూర్‌ ఘటనను ఆయన ప్రస్తావించారు. బర్త్‌డే రోజే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడి ఘటనపై ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేక్‌ కట్‌ చేయాల్సిన 9 ఏళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసిందని జస్టిస్‌ నగేశ్‌ భీమపాక అన్నారు. విద్యుత్‌ ప్రమాదంపై ఎవరికి వారే చేతులు దులిపేసుకుంటే ఎలా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరు?పసిహృదయం పగిలిపోయింది… దీనికి అందరం బాధ్యులమే. సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. చలన రహిత చట్టాలతో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడగలం?’’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

వైర్ల బరువుతో స్తంభాలు ఒరిగిపోతున్నాయన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూళ్లతో కొందరు ఉద్యోగుల జేబులు బరువెక్కుతున్నాయన్నారు. ఒకరినొకరు నిందించుకోవద్దని… ఇలాంటివి పునరావృతం కానివ్వొద్దని సూచించారు. స్తంభాలపై అన్ని వైర్లు నలుపు రంగులో ఉన్నందున గుర్తుపట్టలేకపోయామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొనగా… కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని మాత్రం బాగానే గుర్తుపడతారని న్యాయమూర్తి చురకలంటించారు.

Also Read : PM Narendra Modi: ‘ఇకపై జైలు నుంచి పరిపాలన అసాధ్యం’ – క్రిమినల్ నేతల బిల్లుపై ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!