TGSRTC: జంట నగరాల పరిధిలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు
జంట నగరాల పరిధిలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు
TGSRTC : జంటనగరాల పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో (TGSRTC) ఛార్జీలను పెంచాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ -ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 చొప్పున పెంచనున్నారు. 4వ స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ తర్వాత అదనంగా రూ.10 ఛార్జీ వసూలు చేయనున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది.
నగరంలో దశలవారీగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల రాబోయే రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా డీజిల్ బస్సుల స్థానంలో ప్రవేశ పెట్టాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం మరో పది డిపోలను అదనంగా ఏర్పాటు చేయాలని, వాటికి 10 ఛార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. డిపోలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు ఛార్జీలను వసూలు చేయాల్సి వస్తుందని.. అందుకు ప్రజలు సహకరించాలని టీజీఎస్ ఆర్టీసీ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
TGSRTC – దసరా సీజన్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీకి రూ.110 కోట్ల ఆదాయం
బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా టీజీఎస్ఆర్టీసీకి (TGSRTC) రూ.110 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ సారి 7,754 ప్రత్యేక బస్సులు నడపాలని తొలుత నిర్ణయించినప్పటికీ… ఆశించిన మేర ప్రయాణికులు లేకపోవడంతో 5,300 వరకు మాత్రమే తిప్పినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో ఈసారి 50 శాతం వరకు అదనపు ఛార్జీలను వసూలు చేశారు. గత ఏడాది ఇదే సీజన్లో 6300 ప్రత్యేక బస్సులు నడపగా… రూ.114 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే… ఈసారి సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందని, కొందరు ప్రైవేటు వాహనాలనూ ఆశ్రయించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుగు ప్రయాణానికి సంబంధించి ఈనెల 5, 6వ తేదీల్లో రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించాలని సంస్థ నిర్ణయించింది.
అమెరికాలో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి మృతి
అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ 2023లో బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఇవాళ తెల్లవారుజామున డాలస్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందాడు. బీఎన్‌రెడ్డి నగర్లో ఉన్న బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి మాజీమంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. ఉన్నత స్థానంలో ఉంటాడనుకున్న కుమారుడు ఇక లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసి గుండె తరుక్కు పోతోందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చంద్రశేఖర్ మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
చంద్రశేఖర్ మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మరణం ఆవేదన కలిగించిందన్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చంద్రశేఖర్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అన్నివిధాలా సహకారం అందిస్తామని చెప్పారు.
Also Read : Blast: కోచింగ్ సెంటర్లో పేలుడు ! ఇద్దరు మృతి !
