Thatikonda Rajaiah: గులాబీ పార్టీకు గుడ్ బై చెప్పనున్న మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య !

గులాబీ పార్టీకు గుడ్ బై చెప్పనున్న మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య !

Thatikonda Rajaiah: తెలంగాణాలో ప్రభుత్వం మారి నెల రోజులు తిరగకముందే రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయి. పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్/బీఆర్ఎస్ నాయకులు… ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోగానే ప్రక్కపార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అంతేకాదు ఈ నెల 10న కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి తాటికొండ రాజయ్య అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Thatikonda Rajaiah Viral

ఈ సందర్భంగా రాజయ్య స్టేషన్ ఘనపూర్‌ లో మీడియాతో మాట్లాడుతూ… “నన్ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినా… 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసినా… బీఆర్ఎస్ పార్టీకు విధేయుడిగా ఉన్నాను. పార్టీ ముఖ్య నేతలు ప్రజలతీర్పు అంగీకరించకపోవడం నన్ను కలిచి వేస్తుంది. క్షేత్ర స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరువైంది. స్థానిక, రాష్ట్ర నాయకత్వం లోపంతో కార్యకర్తలు, నాయకులు కష్టాల పాలవుతున్నారని, ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి ఈరోజుకీ లేదన్నారు. మాదిగ ఆస్థిత్వంపై దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని తాటికొండ రాజయ్య ఆరోపించారు. ఆరు నెలల నుంచి మానసిక వేదనకు గురవుతున్నానని… ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన రాజయ్య రాజీనామాతో వరంగల్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.

Also Read: Hero Vijay: తమిళ నాట కొత్త రాజకీయ పార్టీను ప్రారంభించిన హీరో విజయ్‌ !

Leave A Reply

Your Email Id will not be published!