అమరావతి : ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బుధవారం ఈ కేసుపై విచారణ చేపట్టింది ధర్మాసనం. ఇందులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు ఇప్పటికే మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను పొడిగించింది. అయితే ఇదే సమయంలో సాధారణ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నిందితులను సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రూ. 3,500 కోట్ల ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో హైకోర్టు లొంగిపోవాలని ఆదేశించిన ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణను పొడిగించింది. అయితే, నిందితులకు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జాయ్మాల్య బాగ్చి , విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
ఇదిలా ఉండగా గత ఏడాది నవంబర్ 19న హైకోర్టు డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేసి, నవంబర్ 2
న ట్రయల్ కోర్టు ముందు లొంగిపోయి, సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని వారిని ఆదేశించింది. బాలాజీ గోవిందప్ప, పెల్లకూరు కృష్ణ మోహన్ రెడ్డి , కె ధనుంజయ రెడ్డిల పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో ఆంధ్రప్రదే సర్కార్ తో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వారిని లొంగిపోకుండా రక్షించింది. ధనుంజయ రెడ్డి పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి. అంతే కాకుండా ఆయన చాలా కాలం పాటు సీఎం కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేశారు. కృష్ణ మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓఎస్డీగా ఉన్నారు. బాలాజీ గోవిందప్ప భారతి సిమెంట్స్ డైరెక్టర్‌గా ఉన్నారు.
