Arvind Kejriwal : ప్రజా పాలన అందిస్తం హామీలు నెరవేరుస్తం
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : మెరుగైన ప్రజా పాలన అందిస్తామని, తమపై నమ్మకం పెట్టుకున్న పంజాబ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఆప్ పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. 117 సీట్లలో 92 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
ఈ సందర్భంగా ఆదివారం అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని పంజాబ్ ఆప్ సీఎం భగవంత్ మాన్ తో పాటు గెలుపొందిన ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు.
అనంతరం నగరంలో భారీగా విజయోత్సవాన్ని పురస్కరించుకుని రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా అశేష జనవాహినిని ఉద్దేశించి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రసంగించారు.
తాము ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేరుస్తామని చెప్పారు. కొన్నింటిని పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటుపై తాము ఎక్కువగా ఫోకస్ పెడతామన్నారు.
దీక్షా దక్షత, నిబద్దత, ప్రజల పట్ల ప్రేమ కలిగిన నాయకుడు భగవంత్ మాన్ అని ప్రశంసించారు. ఆయన సారథ్యంలో పంజాబ్ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని ఈ సందర్భంగా గెలిపించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు.
ఓట్లు వేసిన వారే కాదు ఓట్లు వేయని వారు కూడా పంజాబ్ ప్రజలేనని స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలలోనే ఉంటారని చెప్పారు. సమస్యలే తమకు ఎజెండా అని ఎవరు ఏ సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని అన్నారు కేజ్రీవాల్.
Also Read : చట్టం ముందు అంతా సమానమే