అమరావతి : కేంద్రం తీపి కబురు చెప్పింది. ఏపీలోని మచిలీపట్నం పోర్డు రోడ్డు అనుసంధానం కోసం ఏకంగా రూ. 570 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఈ సందర్బంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. శనివారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ నిధుల ద్వారా మరింత అభివృద్ది చేసేందుకు దోహదం చేస్తుందన్నారు. ఇదిలా ఉండగా మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారి నెట్ వర్క్ తో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఆరు లేన్ల రహదారి నిర్మించనున్నారు. ఇందుకు గాను ఈ నిధులను ఉపయోగించడం జరుగుతుందన్నారు సీఎం.
కొత్త కారిడార్ కు సంబంధించి లోతట్టు ప్రాంతాలను ఓడ రేవుతో అనుసంధానం చేయడం వల్ల పరిశ్రమలు, ఎగుమతిదారులకు లాజిస్టిక్స్ ఖర్చులను భారీగా తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఇదే క్రమంలో మెరుగైన రహదారి వల్ల మౌలిక సదుపాయల కల్పనకు వీలు ఏర్పడుతుందని, తద్వారా ఆర్థిక వృద్దిని పెంచేందుకు వీలు కలుగుతుందన్నారు. దీని ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు సీఎం. జాతీయ రహదారి 215 లోని మచిలీపట్నం బైపాస్ ద్వారా జాతీయ రహదారి 65 , ఎన్ హెచ్ 216 జంక్షన్ ను మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నిధులను మంజూరు చేస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.