#Pusyamasam : పుష్యమాస విశిష్టత
Pusyamasam: జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయ బడుతుంది. చైత్ర పౌర్ణిమ రోజున చంద్ర సంచారం చిత్తా నక్షత్రమున అవుతుంది కనుక ఆ మాసానికి చైత్ర మాసమని, విశాఖ నక్షత్రమందు సంచరించుట వలన వైశాఖ మాసమని, ఇలా పన్నెండు మాసాల పౌర్ణములలో చంద్రుని సంచారం ఆధారంగా పేర్లను పూర్వీకులు నిర్ణయించారు.
Pusyamasam: జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయ బడుతుంది. చైత్ర పౌర్ణిమ రోజున చంద్ర సంచారం చిత్తా నక్షత్రమున అవుతుంది కనుక ఆ మాసానికి చైత్ర మాసమని, విశాఖ నక్షత్రమందు సంచరించుట వలన వైశాఖ మాసమని, ఇలా పన్నెండు మాసాల పౌర్ణములలో చంద్రుని సంచారం ఆధారంగా పేర్లను పూర్వీకులు నిర్ణయించారు. చంద్రుడు పూర్ణిమ రోజున పుష్యమి నక్షత్రములో సంచరించే మాసం పుష్యమాసం. “పుష్య అంటే పోషణ శక్తి కలిగినది” అని అర్ధం.
ముహుర్తాలు లేని నెలలను శూన్య మాసాలంటారు. మీన మాసంతో కూడిన చైత్రమాసం, మిధున మాసంతో కూడిన ఆషాడ మాసం, కన్యా మాసంతో కూడిన భాద్రపద మాసం, ధనుర్మాసంతో కూడిన పుష్య మాసాలను శూన్య మాసాలంటారు. పుష్యం శీతకాలంలో వస్తుంది. శూన్యమాసమై, గృహ ప్రవేశాలు, శంకు స్థాపనలు, వివాహాది శుభ శోభనాలకు వీలు లేకున్నా, జపతప ధ్యానాదులకు, పితృ దేవతలను పూజించడానికి ఉద్దిష్టమైన మాసమిది. శ్రావణ పౌర్ణమి నుండి పుష్య పౌర్ణమి వరకు వేదాధ్యయయానికి, మంత్రాలు నేర్వడానికి పూర్వకాలం నుండి అనువైన సమయంగా చెప్పబడింది.
పంటలు చేతికొచ్చే సమయం కూడా పుష్య మాసమే(Pusyamasam). కొత్త బియ్యం, కొత్త బెల్లం, నువ్వులు రైతుల చేతికి వస్తాయి. పుష్య మాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నువ్వులు బెల్లంతో చేసిన వంటకాలు శరీరం ఉష్ణోగ్రత పెంచి చలి ప్రభావం నుంచి రక్షిస్తాయి. ధాన్య లక్ష్మీతో పాటు ధనలక్ష్మీ రైతుల చెంత చేరుతుంది. రైతులకు పంట చేతికి అందే కాలం కనుక ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సమేత మహా లక్ష్మిని పూజించడం సనాతన సాంప్రదాయాచరణగా ఉంది.
పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపు తున్నాయి. అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. పుష్య మాసాధిపతియైన శని మరియు నక్షత్రాధిపతియైన గురువును పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని విశ్వాసం. పుష్య అమావాస్య దినాన “శనికి తైలాభిషేకం” నిర్వహించడం ద్వారా శనిబాధ నివృత్తి కలుగుతుంది. వస్త్ర, తిల, అన్నదానాల వల్ల కూడా శని దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఏలిననాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. శాస్త్రీయ కోణం చుస్తే ఈ రెండూ పదార్ధాలు శరీరంలో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.
పుష్య పౌర్ణమి స్నానాలు సకల శ్రేయోదాయకాలు. ఉత్తరాయణ పుణ్య కాలం, తెలుగు వారి పెద్ద పండుగ “సంక్రాంతి” వచ్చేదీ ఈ మాసంలోనే. సూర్యుడు ధనురాశి నుండి మకరరాశిలో ప్రవేశించేదే మకర సంక్రాంతి. ఉత్తరాయణ కాలంలో తిల ధేను ధానాలు, తిల తైలాదులతో శివాలయాలలో దీప దానం, శివారాధనం, శివుని ఘృతముచే అభిషేకించడం మహా ఫలం. నల్ల నువ్వులచే అభ్యంగన స్నానం, తిల హోమం, తిల భక్ష్యం, తెల్ల నువ్వులచే దేవ తర్పణం, నల్ల నువ్వులచే పితృ తర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తున్నది.
పౌర్ణమి తిథియందు పుష్యమి నక్షత్రంతో చంద్రుని కలయిక “పౌషీ పౌర్ణమి”. గ్రహాధిపతి సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడం చేత “మకర సంక్రమణ” అవుతుంది. ఉత్తరాయణంలో సూర్యదేవ, సూర్య కిరణ ఆరాధన చేస్తారు. పంచాయతన పూజా విధానంలో గణపతిని భాద్రపద మాసంలో, అంబికా అమ్మవారిని ఆశ్వీయుజ మాసంలో, శివుని కార్తీక మాసంలో, విష్ణువుని మార్గశిర మాసంలో, సూర్య నారాయణుడిని పుష్య మాసంలో విశేషంగా కొలుస్తారు. ఈ పుణ్య కాలాన సూర్యోదయం నుండి ఐదు ఘడియలు (రెండు గంటలు) వరకు విశిష్ట తేజస్సును ప్రసరింపచేసే సూర్య కిరణాలు జీవ చైతన్యాన్ని ఊర్ధ్వ ముఖంగా ప్రసరింప చేయుటకు తోడ్పడతాయి. మానవ శరీరంలోని వెన్నెముక యందలి “విశుద్ధి చక్రము”, కంఠ స్థానమునందున్న “షోడశ దళ పద్మము”నకు, హృదయ స్థాన మందున్న “అనాహత చక్ర ము”నకు మధ్యన ప్రకాశించే “ప్రజా కేంద్రము”… “మకర రాశిని” సూచిస్తుంది. ఇది మహా విష్ణువు నివాస స్థానం.
అనాహత చక్రానికి నారాయణుడు అధిదేవత, అందువల్ల పుష్య పూర్ణిమ నాడు “ఓం నమో భగవతే వాసుదేవాయ” అని ఉపాసించుట చేత సిద్దిత్వం కలుగుతుంది. మనుస్మృతి, గోభిల మునిచే విరచితమైన ధర్మస్థృతి ప్రకారం శ్రావణ పౌర్ణమి నుండి పుష్య పౌర్ణమి వరకు అభ్యసించిన వేద మంత్రాధ్యయనానికి ముగింపు పలికి, ఇతర విద్యలను మళ్ళీ శ్రావణం వచ్చే వరకు అభ్యసించే వారు. పుష్య పూర్ణిమ నాడు వేద మంత్ర ఉత్సర్ణనము విధిగా చేసే ఆచారం ఉండేది. తమిళ నాట పుష్య పూర్ణిమను “పూసమ్” అంటారు. తైపూసమ్ ఉత్సవాన్ని జరుపు కుంటారు. తంజావూరు నందు ఉత్సవాన్ని వైభవంగా ఆచరిస్తారు. కుజ దోషము కాలసర్ప దోషము, సర్పదోషము, వివాహ అలస్యము, నిస్సంతానత్వం మున్నగు వాటికి స్త్రీ పురుషులు శ్రీ సుబ్రహ్మణ్య, అంగారక గ్రహారాధనలు సత్ఫలితాలను అందిస్తాయి.
పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీ దళాలతో, సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ, ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చించాలి.
శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం.
పుష్యమాసంలో(Pusyamasam) వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి.సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధాన్యరాశులనూ వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, షట్తిలైకాదశి, కల్యాణైకాదశి అని పిలుస్తారు.మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజు నది స్నానాదులు చేసుకుని దైవదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి.
No comment allowed please