చెరువుల రక్షణ విష‌యంలో త‌గ్గేదే లే : ఏవీ రంగ‌నాథ్

పేదల గృహాలను కూల్చే ఉద్దేశం హైడ్రాకు లేదు

హైద‌రాబాద్ : చెరువుల పరిరక్షణలో హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని స్ప‌ష్టం చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఆక్రమణలను అడ్డుకోవటమే కాదు వాటిని ఆరోగ్యకరమైన ప్రాంతాలుగా తీర్చి దిద్దుతామన్నారు. చెరువులు ఇకపై పిల్లలకు, యువతకు పెద్దల ఆరోగ్యానికి క్రీడలకు ఆలవాలంగా మారుస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, చెరువుల అక్రమణుల తొలగింపుల విష‌యంలో వెనుకా ముందు చూసే ప్ర‌స‌క్తి లేదని హెచ్చ‌రించారు. పేదల ఇళ్లను హైడ్రా కూల్చదని అదే సమయంలో పేదలను ముందు పెట్టి ఆక్రమణలు చేసే పెద్దలను వదిలిపెట్టే సమస్య లేదని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాదులో రెడ్ హిల్స్ లో హరిత చైతన్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి మాజీ ఉద్యోగుల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగింపు ఒకటే తమ లక్ష్యం కాదని విషతుల్యంగా మారిన చెరువులను శుభ్రపరుస్తున్నామని అన్నారు.

తద్వారా గుర్రపు డెక్క వంటి చెట్లు మొలవకుండా శుభ్రమైన నీరు చెరువులో ఉండే విధంగా చూస్తున్నామన్నారు. అంతేకాక చెరువుల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వాకింగ్ ట్రాక్ లుగా చిన్న పిల్లలు యువత ఆడుకునే క్రీడా మైదానాలుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని చెరువులను ఈ విధంగా రూపుదిద్దామని మరికొన్ని చెరువులను త్వరలో చేపడుతున్నామన్నారు . ఇప్పటి వరకు హైడ్రా అనేక ఆక్రమణలు తొలగించి వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ ఆస్తులను రక్షించిందని చెప్పారు. ఈ ఏడాది సుమారు 2000 ఎకరాల ఆక్రమణలను తొలగించి రూ . లక్ష కోట్ల ఆస్తులను కాపాడాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. తొలగించాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. సింగరేణి మాజీ ఉద్యోగులు ఈ విధంగా హరిత చైతన్య కళాక్షేత్రం పేరుతో పర్యావరణహితానికి తోడ్పడడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

ఇదే సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అడ్వైజర్, సీనియర్ సైంటిస్ట్ తరుణ్ కత్తుల మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉంటే పరిశ్రమలకు గాని గనులు తవ్వడానికి గాని అనుమతులు ఇవ్వడం లేదన్నారు. తీవ్ర వాతావరణ కాలుష్యంతో బాధ పడుతున్న విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ కాలుష్య నివారణకు తమ వంతు బాధ్యతగా ముందుకు కదలాలన్నారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సీనియర్ సోషల్ సైంటిస్ట్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి జీవి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు పర్యావరణానికి హాని కలిగించే విధంగానే వ్యవహరిస్తున్నారని ఈ ధోరణి మారాలని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!