Road Accident: రెండు లారీలు ఢీ ! ముగ్గురు సజీవదహనం !
రెండు లారీలు ఢీ ! ముగ్గురు సజీవదహనం !
Road Accident : మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ మండలం ఎల్లంపేట దగ్గర జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీనితో లారీ క్యాబిన్లో మంటలు చెలరేగడంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లారీల్లో ఒకటి గ్రానైట్ లోడుతో, మరొకటి చేపల దానాతో వెళ్తున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక లారీ విజయవాడ నుంచి గుజరాత్ వెళ్తుండగా, మరో లారీ వరంగల్ నుంచి ఏపీ వైపు వెళ్తుందని తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదం (Road Accident) కారణంగా ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్యాబిన్లో సజీవదహనమైన మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు.
Road Accident – కాటేదాన్ రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని నేతాజీ నగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున తిరుపతి రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో రబ్బరు సామగ్రి ఎక్కువగా నిలువ ఉండటంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీనితో స్థానికులు భయాందోళనలతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. నాలుగు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాద సమయంలో పరిశ్రమలో కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పరిశ్రమలో కార్లలో ఉపయోగించే రబ్బర్ మ్యాట్లు తయారవుతాయని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Also Read : Supreme Court: క్రైస్తవులకు ఎస్సీ హోదాపై సుప్రీం విచారణ ఆగస్టు 12కు వాయిదా
