Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట ! ముగ్గురి మృతి !

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట ! ముగ్గురి మృతి !

Jagannath Rath Yatra : ఒడిశాలోని పూరీలో అత్యంత వైభవంగా జరుగుతున్న రథయాత్రలో (Jagannath Rath Yatra) అపశ్రుతి చోటు చేసుకుంది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా… 50 మందికి పైగా గాయపడ్డారు. మృతులను ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42)గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బాధితులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం వారికి చికిత్స అందిస్తోంది. బాధితులలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Jagannath Rath Yatra Stampede

పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ వెల్లడించిన వివరాల ప్రకారం… జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) ముగిసిన తర్వాత శనివారం జగన్నాథ ఆలయం నుంచి రథాలు శారద బలి వద్దకు చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూడటానికి భక్తులు గుండిచా ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. దర్శనం కోసం అందరూ ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట నెలకొంది. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. ఈ ఘటనపై ఒడిశా (Odisha) మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

పూరీ రథయాత్రకు శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అధిక జనసమూహం, అలసట కారణంగా దాదాపు 750 మంది భక్తులు అస్వస్థతకు గురవ్వడంతో అధికారులు వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో చాలామందిని ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన 12 మంది భక్తులు కటక్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

‘ఏ ఒక్కరూ పట్టించుకోలేదు’ – మృతురాలి భర్త

ఒడిశాలోని పూరిలో జరుగుతున్న రథయాత్రలో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనలో భార్యను కోల్పోయిన ఒక యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తూ, జరిగిన ఘటన వివరాలను మీడియా ముందు వెళ్లగక్కాడు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులెవరూ స్పందించలేదని, అగ్నిమాపక అధికారులు, రెస్క్యూ బృందం, వైద్య సిబ్బంది సమయానికి చేరుకోలేదని ఆరోపించారు. పురి నివాసి స్వాధిన్ కుమార్ పాండా మాట్లాడుతూ జనసమూహ నియంత్రణలో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ట్రాఫిక్ ఏర్పాట్లు సరిగా లేవన్నారు. ఈ ఘటనకు ఒడిశా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పాండా డిమాండ్‌ చేశారు. ఈ ఘటన దరిమిలా ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యిందని ఒడిశా న్యాయ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. ఘటనా స్థలంలో డీజీపీ ఉండి, పరిస్థితులను చక్కదిద్దుతున్నారని పేర్కొన్నారు.

Also Read : TTD: తిరుమల కల్తీ నెయ్యి దర్యాప్తుపై సుప్రీంకోర్టుకు సిట్‌ నివేదిక

Leave A Reply

Your Email Id will not be published!