Simhachalam: సింహాచలం దుర్ఘటనపై ప్రభుత్వానికి త్రిసభ్య కమిషన్ నివేదిక
సింహాచలం దుర్ఘటనపై ప్రభుత్వానికి త్రిసభ్య కమిషన్ నివేదిక
చందనోత్సవం సందర్భంగా సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గోడ దుర్ఘటనపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుకి… కమిషన్ చైర్మన్, పురపాలక శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ ఈ నివేదికను అందజేశారు. ‘‘తాత్కాలికంగా కట్టిన గోడకు పునాది కూడా లేదు. భారీ వర్షం వల్ల పెద్ద ఎత్తున నీరు, బురద చేరి గోడ కూలింది. గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవు. చందనోత్సవానికి వారం ముందు హడావిడిగా గోడ నిర్మించారు. ప్రసాద్ పథకంలో భాగంగా గోడకు అనుమతి ఇచ్చారు. డిజైన్, పునాది లేకుండానే గోడను కట్టేశారు. గోడ సామర్థ్యం, భక్తుల భద్రత గురించి తనిఖీలు చేయలేదు. విశాఖ సీపీ, సాక్షుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశాం. దుర్ఘటనకు ఆలయ ఈవో, ఇంజినీరింగ్ సిబ్బంది, పర్యాటకశాఖ అధికారులు, గుత్తేదారులే బాధ్యులు. వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలి’’ అని కమిషన్ తమ నివేదకలో పేర్కొంది.
సింహాచలంలో శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం ఏప్రిల్ 30వ తేదీన జరిగింది. ఆ రోజు తెల్లవారుజామున 300 రూపాయల టికెట్ల కోసం క్యూ లైన్ లో ఉన్న భక్తులపై గోడ కూలింది. ఈ దుర్ఘటనలో 7 మంది మరణించారు. ఈ ఘటనలో మృతి చెందినవారితోపాటు గాయపడిన వారికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అంతేకాదు ఈ ఘటనపై సమగ్ర విచారణకు ప్రభుత్వం త్రి సభ్య కమిషన్ నియమించింది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటించిన త్రి సభ్య కమీషన్… విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ తో సహా పలువురు ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్‌మెంట్లను నమోదు చేసింది.
ఈ దుర్ఘటనకు ఆలయ ఈఓ, ఇంజనీరింగ్ సిబ్బంది, టూరిజం కార్పోరేషన్ అధికారులు, కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు బాధ్యులని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. వీరందరిపై తీవ్ర చర్యలకు త్రీసభ్య కమిషన్ సిఫార్సు చేసింది. ఏప్రిల్ 21వ తేదీన నిర్మించిన గోడకు వీపింగ్ హోల్స్ లేక పోవడం ప్రమాదానికి ప్రధాన కారణమని ఈ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. కనీసం పునాది లేకుండా, కాంక్రీట్ వేయకుండా గోడను నిర్మించినట్టు నివేదికలో వెల్లడించింది. ఫ్లై యాష్ వినియోగించి ఈ స్థాయిలో 20 మీటర్ల గోడను నిర్మించినట్టు తెలిపింది. గోడ నిర్మాణం తరవాత సరిగా క్యూరింగ్ కూడా జరగలేదని తమ విచారణలో వెల్లడైనట్లు చెప్పింది. నిర్మితమైన గోడను దేవాదాయ, టూరిజం కార్పొరేషన్ ఇంజినీర్లు సర్టిఫై కూడా చేయలేదని తన నివేదికలో కమిషన్ పేర్కొంది. మెట్ల రూట్ మార్చడంలో నిర్దిష్టమైన అనుమతులు సైతం లేవని ఆ నివేదికలో కమిషన్ వెల్లడించింది.
నివేదిక ఆధారంగా ఏడుగురిపై సన్పెన్షన్ వేటు
సింహాచలం దేవస్థానంలో దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి త్రిసభ్య కమిషన్ నివేదిక అందించింన కొద్దిసేపటికే… నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ దుర్ఘటనకు బాధ్యులైన ఏడుగురిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దేవాదాయ శాఖతోపాటు పర్యాటక శాఖలలోని వారిపై ఈ సస్పెన్షన్ వేటు వేసింది. సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు, సింహాచలం దేవస్థానం ఈఈ డి జి శ్రీనివాసరాజు, ఏపీటీడీసీ ఈఈ కె రమణ, దేవస్థానం డిప్యూటీ ఈఈ కె ఎస్ ఎన్ మూర్తి, ఏపీటీడీసీ డిప్యూటీ ఈఈ ఏ బీ వీ ఎల్ ఆర్ స్వామి, ఏపీటీడీసీ ఏఈ పి మదన్ మోహన్, దేవస్థానం జేఈ కె బాబ్జీపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు కాంట్రాక్టర్ కె లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యల తీసుకోవాలని ఆదేశించింది.