TikTok: భారత్ లో మళ్లీ ‘టిక్‌టాక్’ ? ఐదేళ్ల తర్వాత అందుబాటులోకి వెబ్ సైట్ !
భారత్ లో మళ్లీ ‘టిక్‌టాక్’ ? ఐదేళ్ల తర్వాత అందుబాటులోకి వెబ్ సైట్ !
TikTok : ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ సేవలు భారత్‌లో మళ్లీ అందుబాటులోకి రాబోతున్నాయా ? ఇప్పుడిదే చర్చ దేశ వ్యాప్తంగా నడుస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారి టిక్‌టాక్ (TikTok) వెబ్సైట్ అనేకమందికి అందుబాటులోకి రావడమే ఈ తరహా చర్చకు కారణమైంది. 2020లో సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలతో చైనాకు చెందిన ఈ వీడియో మేకింగ్ ప్లాట్‌ఫామ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం చాలా మంది యూజర్లు తమకు టిక్‌టాక్ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, టిక్‌టాక్ యాప్ మాత్రం ఇప్పటివరకు ప్లేస్టోర్‌లో అందుబాటులోకి రాలేదు.
TikTok Updates
2020 జూన్ లో 59 యాప్‌లు, సెప్టెంబర్ లో మరో 118 చైనీస్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించి ఆ దేశ కంపెనీలకు గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దులోని గల్వాన్ వద్ద భీకర ఘర్షణ తర్వాత చైనా తీరు పట్ల దేశంలో అనేక అనుమానాలు వ్యక్తమై భారతీయుల సమాచార భద్రత, గోప్యత, దేశ సౌర్వభౌమత్వానికి భంగం కలుగుతోందన్న కారణాల రీత్యా టిక్‌టాక్ (TikTok), హెలో, పబ్జీ, షేరిట్, యూసీ బ్రౌజర్, బైడు మ్యాప్, క్లాష్ ఆఫ్ కింగ్స్ వంటి యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.
అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్, చైనాలపై టారిఫ్ లు పెంచడం, తాజాగా భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న సమయంలో ఈ తరహా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ భారత్‌ను సందర్శించి ట్రంప్ సుంకాలకు వ్యతిరేకిస్తూ భారత్‌కు చైనా మద్దతును ప్రకటించారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్లను కలిశారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వరకు చైనాలో జరగనున్న షాంఘై సహకార సదస్సుకు ప్రధానిని ఆహ్వానించిన విషయం తెలిసిందే.
TikTok – ఐదేళ్ల తర్వాత తెరుచుకొన్న భారత్-చైనా బోర్డర్ ట్రేడ్ పాయింట్స్
భారత్-చైనాల మధ్య దాదాపు ఐదేళ్ల తర్వాత మూడు సరిహద్దు వాణిజ్య కేంద్రాల మార్గాలు తెరుచుకొన్నాయి. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు, టిబెట్ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థలకు ఇవి అత్యంత కీలకమైనవి. ఇరుదేశాలు ఈ పాస్ లు తెరుచుకొన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి. ఇటీవల ఇరుదేశాల విదేశాంగ మంత్రులు వాంగ్‌యీ, జైశంకర్ న్యూదిల్లీలో భేటీ సందర్భంగా ఈనిర్ణయం తీసుకొన్నారు.
తాజాగా తెరుచుకొన్న మార్గాల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని ది షిప్కిలా పాస్, ఉత్తరాఖండ్‌లోని లిపులేక్ పాస్, సిక్కింలోని నాథులా పాస్ ఉన్నాయి. 2020లో కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వీటిని మూసివేశారు. ఆ తర్వాత ట్రేడర్లు డిమాండ్ చేస్తున్నా.. సరిహద్దు ఘర్షణలు, దీర్ఘకాలికంగా ఉన్న సైనిక ఉద్రిక్తతలతో అవి మళ్లీ తెరుచుకోలేదు. ఈ ట్రేడ్ పోస్టులు ఇరువైపులా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు వాడుకొనేవారు. ఈ మార్గాలు చైనా వైపు షిగాట్సె, లాసా, న్యింగ్చిలను చేరతాయి. వాస్తవానికి ఈ మార్గాల్లో వాణిజ్యం మే-నవంబర్ మధ్యలోనే జరుగుతుంది. వాస్తవానికి ద్వైపాక్షిక వాణిజ్యానికి భిన్నంగా.. ఈ మార్గాల్లో జరిగే వ్యాపారంలో భారత్ ఎక్కువ ఎగుమతులతో లబ్ధి పొందింది.
Also Read : AP Government: యూరియాపై ఏపీ ప్రభుత్వం అలర్ట్
