Tiranga Rally: విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ ! ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు, పవన్, పురందేశ్వరి !
విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ ! ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు, పవన్, పురందేశ్వరి !
ఆపరేషన్ సిందూర్, అనంతరం పాకిస్తాన్ జరిపిన దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత సైనికులకు మద్దతుగా శుక్రవారం నాడు విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఇందీరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ నిర్వహించిన ఈ ర్యాలీను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కూటమి నేతలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీకి నగరవాసులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా భారత రక్షణ దళాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెల్యూట్ చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ… ఆపరేషన్ సిందూర్ లాంటి కార్యక్రమాలకు దేశం సిద్ధమని, ఇదే ప్రపంచంలోని ఉగ్రవాదులకు హెచ్చరిక కావాలని చంద్రబాబు అన్నారు. పహల్గామ్ ఘటనలో ఆడబిడ్డల కుంకుమ చెరిపేసిన వాళ్లు ఈ భూమ్మీద ఉండకూడదనే ఆపరేషన్ సిందూర్ చేపట్టారని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న ఏకైక నాయకుడు మోదీ అని ముఖ్యమంత్రి కొనియాడారు. త్రివర్ణ పతాక రూపశిల్పి ఈ ప్రాంతం వారేనని గుర్తుచేశారు. ఆపరేషన్ సిందూర్ లో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్‌కు నివాళులు అర్పించారు చంద్రబాబు. పాకిస్థాన్ కుట్రలు, కుతంత్రాలు భారతదేశాన్ని ఏం చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వారిని తుదముట్టించాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని చెప్పుకొచ్చారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలను మోదీ తీసుకుంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సెలబ్రిటీస్ నుంచి దేశభక్తి ఆశించవద్దు – పవన్ కల్యాణ్
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ భారతదేశంలో పాకిస్థాన్ వల్ల ఎప్పుడు ప్రశాంతత చూడలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందుతుంటే పాకిస్థాన్ చూసి ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే బోర్డర్‌లో దేశాన్ని కాపాడుతున్న సైనికుల వల్లే అది సాధ్యమవుతోందని తెలిపారు. దేశం కోసం పోరాడిన మురళీనాయక్ లాంటి సైనికులు దేశానికి నిజమైన నాయకులని పవన్ చెప్పుకొచ్చారు. చనిపోతే సైనికుడిగా దేశం కోసం పోరాడిన మురళీ నాయక్‌లాగా చనిపోవాలని అన్నారు. సెలబ్రిటీస్ నుంచి దేశభక్తి ఆశించవద్దని… సినిమా హీరోలంతా దేశాన్ని నడిపేవారు కాదని అన్నారు. వాళ్లంతా ఎంటర్‌టైన్ చేసేవాళ్లు మాత్రమేనని పేర్కొన్నారు. శాంతి వచనాలు ఇక పని చేయవని.. పాకిస్థాన్ వాళ్లు భారత్‌లోకి వచ్చి కొడితే వాళ్ల సరిహద్దు దాటి వారి ఇళ్లల్లోకి వెళ్లి మనం కొడతామని పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.
పాకిస్థాన్‌కు ధీటుగా జవాబు ఇచ్చాం – దగ్గుబాటి పురంధేశ్వరి
భారతదేశ ఐక్యమత్యాన్ని చాటేందుకు తిరంగా యాత్రకు ప్రజలు భారీగా తరలి వచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. 2014 సంవత్సరం నుంచి సమర్ధవంతమైన నాయకత్వం దేశానికి లభించిందని గుర్తుచేశారు. దేశ భద్రతకు ఆటంకం కలిగిస్తే.. ఎదురుదాడి చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇటీవల మన వాళ్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న ఘటనలో పాకిస్థాన్‌కు జవాబు దీటుగా ఇచ్చామని దగ్గుబాటి పురందేశ్వరి ఉద్ఘాటించారు. ‘మన పౌరులపై పాకిస్థాన్ దాడులు చేస్తే.. వారి స్థావరాలను ధ్వంసం చేశాం. సరిహద్దుల్లో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశప్రజలకు రక్షణ వలయంగా నిలబడుతున్న సైనికులకు, ప్రధాని మోదీకి సంఘీభావంగా ఈ తిరంగా యాత్ర చేపట్టాం. మన దేశం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సైనికులకు అండగా ఉంటూ ప్రజలంతా సంఘీభావం తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇదే స్పూర్తితో సైనికులు, మోదీకి ప్రజలంతా అండగా ఉండాలి’ అని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
వీరజవాన్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం
‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్‌లో ఈనెల 8న పాకిస్తాన్‌తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఈ నెల 13న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే.. పార్టీ తరపున ఆయన రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. రూ.25 లక్షల రూపాయల చెక్కును వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అందజేశారు. గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి వీర జవాన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కును ఆమె అందించారు.