Tirumala : మరోసారి శ్రీవారి ఆలయంపై విమానం వెళ్లడంపై భక్తుల ఆగ్రహం

ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు...

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి ఓ విమానం చక్కర్లు కొట్టింది. తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయ సమీపంలోకి మరోసారి విమానం వెళ్లింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరింది. అయితే దీన్ని కేంద్ర విమానాయాన శాఖ పట్టించుకోవడం లేదు. తరచూ శ్రీవారి ఆలయ గోపురం పై నుంచి విమానాలు వెళ్తుండటంపై వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (గురువారం) తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయం పై నుంచి ఓ విమానం వెళ్లింది. గత కొద్ది రోజులుగా నిత్యం శ్రీవారి ఆలయం పై నుంచి విమానాలు వెళ్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ ఆగమ నిబంధనల ప్రకారం ఆలయంపై రాకపోకలు సాగించడం నిషిద్ధం. ఇలాంటి రాకపోకలు సాగిస్తే ఏదైనా ఉపద్రవాలు సంభవిస్తాయని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకీ సూచించారు.

Tirumala Flight Issue

ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు.. శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని, అలాగే నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని పలుమార్లు టీటీడీ పాలకమండలి ద్వారా కేంద్ర విమానాయాన శాఖకు విజ్ఞప్తి చేశారు. అయితే రేణిగుంట విమానాశ్రయంలో పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో నో ఫ్లై జోన్‌గా ప్రకటించేందుకు సాధ్యం కాదని అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు సాగకుండా చూస్తామని అధికారులకు కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఈ నిర్ణయం కూడా బుట్టదాఖలైన పరిస్థితి ఏర్పడింది. గత కొంత కాలంగా తరచూ శ్రీవారి ఆలయానికి సమీపంలో, తిరుమల ఆలయంపై కూడా విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. టీటీడీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ విమానయాన అధికారులు పట్టించుకోకపోవడంతో టీటీడీ అధికారులు చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. ఆలయంపై విమానాల రాకపోకలను చూస్తున్న భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేస్తున్నారు.ఆలయ నిబంధనల ప్రకారం విమానాల రాకపోకలు సాగకూడదని చెబుతున్నప్పటికీ ఇలా విమానాల రాకపోకలను సాగించడంపై శ్రీవారి భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Happy New Year 2025 : తెలుగు ఇజం వీక్షకులకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు

Leave A Reply

Your Email Id will not be published!