Tirumala: పహల్గాం దాడితో తిరుమలలో హై అలర్ట్ ! ఆక్టోపస్ బృందాలతో మాక్ డ్రిల్ !
పహల్గాం దాడితో తిరుమలలో హై అలర్ట్ ! ఆక్టోపస్ బృందాలతో మాక్ డ్రిల్ !
Tirumala : జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలు చోట్ల భద్రతా సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజ్ లను తనిఖీ చేస్తున్నారు. ముష్కరులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరిక చేసిన నేపథ్యంలో తిరుమలకు(Tirumala) వస్తున్న భక్తులను అందరినీ కూడా భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తోంది. అలిపిరి వద్ద నుంచే భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, భక్తులను కూడా సెర్చ్ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డు, తిరుమలలో కూడా టీటీడీ(TTD) విజిలెన్స్ సిబ్బంది పలు చోట్ల సోదాలు చేపడుతున్నారు. భక్తుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ… అందులో ఏదన్నా అనుమానంగా వస్తువులు కనిపిస్తే భక్తులను విచారించిన తర్వాతే వారిని విడిచిపెడుతున్నారు.
అటు తిరుమలలో కూడా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కూడా భద్రతను పెంచడంతో పాటు అక్కడ ఆక్టోపస్ సిబ్బందితో పహారా కాసేలా ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా శ్రీవారి ఆలయం వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసు, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలు ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నాయి.
Tirumala – మరోసారి బయటపడ్డ టీటీడీ విజిలెన్స్ డొల్లతనం
ఇదిలా ఉండగా.. తిరుమలలో భద్రతలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఓ వైపు కశ్మీర్ ఉగ్రదాడులు నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ తిరుమలలో ఆకస్మికంగా తనిఖీలంటూ హడావుడి చేస్తుండగా… మరోవైపు అన్యమత దేవుడి బొమ్మ అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకుని మరీ తిరుమలకు చేరుకుంది. కారుపై అన్యమత పేర్లు ఉన్నా కూడా భద్రతా సిబ్బంది ఆ వాహనాన్ని తిరుమలకు అనుమతించారు. దీనితో తిరుమలలో అన్యమత గుర్తులతో కారు యదేచ్ఛగా తిరుగుతోంది. ఈ కారును చూసి శ్రీవారి భక్తులు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Pawan Kalyan: పహల్గాం ఉగ్రదాడి మృతులకు సీఎం, డిప్యూటీ సీఎం నివాళులు