TTD: టీటీడీ ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా 1000 ఆలయాల నిర్మాణం

టీటీడీ ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా 1000 ఆలయాల నిర్మాణం

TTD : రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి ఆలయాలను నిర్మించాలని టీటీడీ ధర్మకర్తల మండలిలో నిర్ణయించారు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో 6 ఆలయాల వరకు నిర్మిస్తామని టీటీడీ (TTD) ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మతమార్పిడుల కట్టడికి శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మిస్తామన్నారు. ప్రధానంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపిన ఆయన.. తొలిసారిగా బ్రహ్మోత్సవాలను ఇస్రో పరిశీలించబోతున్నట్లు చెప్పారు.

TTD New Innovation

‘‘ఈనెల 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 24 నుంచి అక్టోబరు 2 వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈనెల 24న మీనలగ్నంలో ధ్వజారోహణం, అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. పది రోజులపాటు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేయబోతున్నాం. ఈనెల 28న శ్రీవారి గరుడసేవకు 3 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నాం. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్‌ విధానం అమలు చేయబోతున్నాం’’ అని బీఆర్‌ నాయుడు తెలిపారు. అంతకుముందు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు సభ్యులతో కలిపి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌-2025ని బీఆర్‌ నాయుడు విడుదల చేశారు.

తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈనెల 24 నుంచి నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ (TTD) సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ (TTD) ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌ సింఘాల్‌, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఆలయ శుద్ధి అనంతరం స్వామివారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నేపథ్యంలో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఈవో అనిల్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ… టీటీడీ ఛైర్మన్‌, అధికారులు, సిబ్బందితో కలిసి ఆలయాన్ని శుద్ధి చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోందని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి మూలవిరాట్‌ దర్శనంతో పాటు వాహనసేవలను వీక్షించే అవకాశం కల్పిస్తామని చెప్పారు.

అలిపిరి వద్ద ‘అది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదు’ – ఫ్యాక్ట్‌చెక్‌

తిరుపతిలో అలిపిరి వద్ద శ్రీమహా విష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని, ఘోర అపచారం జరిగిపోయిందంటూ కొందరు చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఏపీ (AP) ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ఖండించింది. దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని వెల్లడిస్తూనే… ఫేక్‌ ప్రచారాలతో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవంటూ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఈ అంశంపై ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టింది.

‘‘తిరుపతిలోని అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కారు పార్కింగ్ వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉందని… ఆ ప్రదేశమంతా అశుద్ధం, అపవిత్రంగా ఉందంటూ వైసీపీ నేత భూమ‌న క‌ర‌ణాక‌ర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారంటూ ఓ వీడియోను కొందరు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు… ‘హిందుత్వ సంఘాలు, మఠాధిపతులు మేల్కొనాలి’ అంటూ భక్తుల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారం.

ఈ విషయమై ఆరా తీసినప్పుడు తెలిసింది ఏంటంటే… ఆ విగ్రహం మహావిష్ణువుది కాదు. అసంపూర్ణంగా చెక్కిన శనీశ్వరుడి విగ్రహం. తయారీలో లోపం కారణంగా గతంలో ఇక్కడ శిల్పాలు చెక్కిన పట్టు కన్నయ్య అనే శిల్పి దాన్ని ఇక్కడ పడేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… గత పదేళ్లుగా ఆ విగ్రహం అక్కడే పడి ఉంది. అందువల్ల ఎవరూ ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మొద్దు. అలాగే భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా , షేర్ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించింది.

Also Read : Google: వచ్చే నెలలో విశాఖకు గూగుల్‌ ?

Leave A Reply

Your Email Id will not be published!