Turkish Warship: కరాచీ తీరానికి తుర్కియే యుద్ధనౌక

కరాచీ తీరానికి తుర్కియే యుద్ధనౌక

Turkish Warship : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. పహాల్గాం ఉగ్రదాడికి(Pahalgam Terror Attack) ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే భారత్ అనేక ఆంక్షలు విధించింది. భారత్‌ లోని పాక్‌ జాతీయులను దేశం నుంచి వెళ్లగొట్టడమే కాకుండా… సింధు నదీ జలాల ఒప్పందం రద్దు, పాక్‌ విమానాలకు భారత్‌ గగనతలం మూసివేయడం, దిగుమతులను స్తంభింపజేయడం లాంటి చర్యలతో పాక్‌ను అన్నివైపుల నుంచి దిగ్భంధిస్తోంది. ఈ క్రమంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలను చవిచూడాల్సి వస్తుందోనని ఇటు భారత్… అటు పాకిస్తాన్‌ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

ఈ క్రమంలోనే పాకిస్తాన్ తన మిత్రదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారత్ ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే… దానిని ధీటుగా ఎదుర్కోవడానికి మిత్ర దేశాల నుండి ఆర్ధిక, ఆయుధాల మద్దత్తు కోరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దీనికి మరింత బలం చేకూర్చేలా… తుర్కియేకు చెందిన ‘ టీజీసీ బుయుకడా’ అనే భారీ యుద్ధ నౌక(Turkish Warship) కరాచీ తీరాన్ని చేరింది. 2013లో జలప్రవేశం చేసిన ఈ నౌక జలాంతర్గాములకు వ్యతిరేకంగా పని చేయగలదు. గస్తీ కాయడంలో దీనిది అందవేసిన చేయి. పలు నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి నౌక కరాచీ తీరానికి చేరడం ఇప్పుడు ఆశక్తిని రేపుతోంది.

పాకిస్తాన్‌ కు చెందిన నౌకలకు జలమార్గాలను భారత్‌ నిషేధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తుండంతో భారత్‌ ఏ క్షణమైనా ఎదురుదాడి చేయవచ్చని పాకిస్తాన్‌ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సముద్రమార్గంలోనూ దాడి చేసే అవకాశం ఉన్నందున తుర్కియేను సంప్రదించి… గస్తీ నౌకను తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.

Turkish Warship – ఉన్నత స్థాయి సమావేశానికి పీటీఐ డుమ్మా!

భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు ఆర్మీ ఉన్నతాధికారులు, ప్రతిపక్ష పార్టీలతో కలసి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పాక్‌ ప్రభుత్వం నిర్ణయించింది. చేపట్టబోయే కార్యాచరణ గురించి పాక్‌ ఆర్మీ అధికారులు… వివిధ పార్టీల నేతలకు వివరించాలని భావించారు. అయితే, ఈ సమావేశానికి హాజరుకాబోమని ఇమ్రాన్‌ ఖాన్‌ కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ-ఇన్సాఫ్‌ (పీటీఐ) వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. చాలా కాలంగా ఉగ్రవాదాన్ని పీటీఐ ఖండిస్తోందని, పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ కూడా ఈ విషయంలో తన వైఖరిని పలుమార్లు బహిరంగ సమావేశాల్లోనూ నొక్కి చెప్పారని ప్రకటనలో పేర్కొంది.

Also Read : Hindupur: హిందూపురంలో బాలకృష్ణ పర్యటనలో ఉద్రిక్తత

Leave A Reply

Your Email Id will not be published!