TVK Chief Vijay: లాకప్‌ డెత్‌ మరణంపై టీవీకే చీఫ్ విజయ్‌ నిరసన

లాకప్‌ డెత్‌ మరణంపై టీవీకే చీఫ్ విజయ్‌ నిరసన

Vijay : తమిళనాడులో అజిత్‌ కుమార్‌ అనే సెక్యూరిటీ గార్డు లాకప్ డెత్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం నుంచి తమకు కావాల్సింది సారీ కాదని, న్యాయం అని ఆయన వ్యాఖ్యానించారు.

TVK Party Chief Vijay Stages Dharna

అజిత్‌ కుమార్‌ కస్టోడియల్ డెత్ కు నిరసనగా చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ (Vijay) నల్ల చొక్కా ధరించి… ‘సారీ కాదు, మాకు న్యాయం కావాలి’ అని రాసున్న ప్లకార్డును పట్టుకున్నారు. ‘ప్రభుత్వం నుంచి మనకు ఎక్కువగా సారీ అనే సమాధానమే వస్తోంది. అన్నా యునివర్సిటీ కేసు నుంచి అజిత్‌ కుమార్ కేసు వరకు… మీ పాలనలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి?. కోర్టులే జోక్యం చేసుకుని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.

అలాంటప్పుడు మీ పాలనతో మాకేం అవసరం?. ముఖ్యమంత్రితో అవసరం ఏముంది?. అజిత్‌ కుమార్‌ పేద కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. ఈ ఘటన అనంతరం సీఎం సారీ చెప్పారు. మీ హయాంలో మొత్తం 24 మంది కస్టడీలో మరణించారు. వారందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి. అజిత్‌ కుటుంబానికి ఇచ్చినట్లే ఆ బాధిత కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలి’ అని విజయ్‌ (Vijay) డిమాండ్‌ చేశారు.

శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపంలోని మడపురంలో భద్రకాళియమ్మన్‌ ఆలయానికి ఇటీవల వచ్చిన ఇద్దరు మహిళా భక్తుల నగలు అపహరణకు గురయ్యాయి. ఈ కేసులో ఆ ఆలయ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న అజిత్‌కుమార్‌ తో సహా పలువురిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో అజిత్‌ను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. దీనితో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. కాగా… అజిత్‌ ఒంటిపై 44 గాయాలున్నట్లు పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది. దీనితో కస్టడీలో ఉన్నప్పుడు అతడు తీవ్రమైన హింసకు గురైనట్లు వైద్యులు తెలిపారు. గుండె, కాలేయం వంటి అంతర్గత భాగాల్లో తీవ్ర రక్తస్రాం అయినట్లు వెల్లడించారు.

Also Read : Goods Train: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం ! గూడ్స్‌ రైలు దగ్ధం !

Leave A Reply

Your Email Id will not be published!