Bihar Assembly Elections: బిహార్ మహా కూటమిలోకి మరో రెండు పార్టీలు !
బిహార్ మహా కూటమిలోకి మరో రెండు పార్టీలు !
Bihar Assembly Elections : బిహార్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార, విపక్ష కూటమి పార్టీల్లో సీట్ల పంపకాలపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. తాజాగా విపక్ష మహా కూటమిలోకి మరో 2 పార్టీలు వచ్చి చేరాయి. హేమంత్ సోరేన్ నేతృత్వంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా, పసుపతి పరాస్ నేతృత్వంలోని ఎల్జేపీ మహాకూటమిలోకి రావడంతో సీట్ల సర్దుబాటు మరింత క్లిష్టం కానుంది. ప్రస్తుతం మహా కూటమిలో లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఎంఎల్ సహా 6 పార్టీలు ఉన్నాయి. తాజాగా చేరిన పార్టీలతో కలిసి మొత్తం 8 పార్టీలు మొత్తం 243 సీట్లను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు అధికార ఎన్డీయే కూటమిలోనూ సీట్ల పంపిణీపై మల్లగుల్లాలు కొనసాగుతున్నాయి. చిరాగ్ పాసవాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా అధిక సీట్లను డిమాండ్ చేస్తున్నారు.
Bihar Assembly Elections New Parties
పసుపతి పరాస్ (ఎల్జేపీ)ను ఉపయోగించి… పాసవాన్ వర్గానికి చెందిన ఓట్లను విడగొట్టాలని మహాకూటమి భావిస్తోంది. ప్రత్యేకించి పాసవాన్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఖగారియా ప్రాంతంలో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. చాలా ఏళ్ల నుంచి పసుపతి పరాస్ ఖగారియాలోని అలౌలీ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎల్జేపీ పరాస్ వర్గానికి రెండు లేదా మూడు సీట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు హజీపూర్ నుంచి పరాస్‌ను బరిలోకి దించితే.. పాసవాన్ ఓట్లను విడగొట్టవచ్చని కూటమి నేతలు భావిస్తున్నారు.
ఝార్ఖండ్ ప్రభుత్వంలో కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వాములుగా ఉన్నందున బిహార్‌లో (Bihar) ఆ పార్టీకి కనీసం ఒక్క సీటైనా కేటాయించాల్సిన అవసరం ఉంది. బంకా, ముంగర్, భాగల్పుర్ స్థానాల్లో ఏదో ఒక సీటును జేఎంఎంకు కేటాయించే అవకాశం ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీట్ల సర్దుబాటును పరిశీలిస్తే.. ఆర్జేడీ 144 స్థానాల్లో బరిలోకి దిగి 75 చోట్ల విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్ 70 స్థానాలకు గానూ 19 చోట్ల గెలుపొందింది. సీపీఐ-ఎంఎల్ 19 నియోజకవర్గాల్లో పోటీ చేసి 12 చోట్ల గెలుపు బావుటా ఎగురవేసింది. సీపీఎం, సీపీఐ వరుసగా 4, 6 స్థానాల్లో పోటీ చేసి చెరో రెండు చోట్ల విజయం సాధించాయి. గత ఫలితాలను దృష్టిలో ఉంచుకొని, కూటమిలోని అన్ని పార్టీలకు సమన్యాయం జరిగేలా సీట్లను పంపిణీ చేసేందుకు కూటమి నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
Also Read : Justice NV Ramana: కోర్టు కేసులు పెరగడానికి కారణం లోపభూయిష్టమైన చట్టాలు – జస్టిస్ ఎన్.వి.రమణ
