Uddhav Thackeray: ఒకే వేదికపైకి ఠాక్రే సోదరులు ?

ఒకే వేదికపైకి ఠాక్రే సోదరులు ?

Uddhav Thackeray : విడిపోయిన అన్నదమ్ములు ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray), రాజ్‌ ఠాక్రేలు ఒకే వేదికపై కలవనున్నారు. హిందీని బలవంతంగా ప్రజలపై రుద్దాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ఉమ్మడి నిరసన చేపట్టనున్నట్లు ఇరువురు నేతలు ఇప్పటికే వెల్లడించారు. వచ్చేనెల 5న చేపట్టనున్న ఈ నిరసన ఠాక్రేలు ఇద్దరినీ ఒకే వేదిక పైకి తీసుకురానుంది. మొదటగా జులై 6న గిర్‌గావ్‌ చౌపాటీ నుంచి రాజకీయేతర పాదయాత్ర చేయనున్నట్లు రాజ్‌ ఠాక్రే, మరుసటిరోజు ఆజాద్‌ మైదానంలో చేపట్టే నిరసనలో భాగస్వామ్యులవండి అని ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) పిలుపునిచ్చారు. ఈ నిరసనలకు వీరివురు అన్ని పార్టీలను ఆహ్వానించడం గమనార్హం.

Uddhav Thackeray Brothers

ఈ సందర్భంగా శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ… ‘‘జులై 6న చేపట్టే నిరసనలో భాగస్వామ్యం కావాలంటూ రాజ్‌ఠాక్రే నన్ను ఆహ్వానించారు. ఉద్ధవ్‌ ఠాక్రే దీనికి వెంటనే సమ్మతించారు. కానీ రాష్ట్రమంతా కోలాహలంగా జరుపుకునే ‘ఆషాడీ ఏకాదశి’ పండుగ రోజున నిరసన చేపడితే ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. రెండు పార్టీలు ఉమ్మడిగా నిరసన చేపడదామని ఉద్ధవ్‌ సూచించడంతో రాజ్‌ కూడా దీనికి అంగీకరించారు’’ అని ఆయన వెల్లడించారు. దీంతో ఠాక్రే (Uddhav Thackeray అన్నదమ్ములిద్దరూ తిరిగి కలవనున్నారని కొంతకాలంగా జరగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది.

ఎంపీ కారు డ్రైవర్‌కు రూ.150 కోట్ల విలువైన ల్యాండ్‌ ‘గిఫ్ట్‌’ 

మహారాష్ట్రలో ఓ ఎంపీ కారు డ్రైవర్‌కు నిజాం దివాన్ వారసులు రూ.150 కోట్ల విలువైన భూమి బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే…

శివసేన ఎంపీ సందీప్‌ భూమ్రే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలాస్‌ వద్ద జావెద్‌ రసూల్‌ షేక్‌ అనే వ్యక్తి 13 ఏళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉంటున్న నిజాం దివాన్‌ వారసులు రూ.150 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని గీఫ్ట్‌డీడ్‌ కింద రాసిచ్చారు. దీనిపై ముజాహిద్‌ ఖాన్ అనే న్యాయవాది ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ భూమిపై దివాన్‌ వారసులు సుదీర్ఘమైన న్యాయపోరాటం చేశారని, 2022లో వారికి అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని దక్కించుకోగలిగారని ముజాహిద్‌ తెలిపారు. అలాంటి భూమిని రక్తసంబంధం లేని వ్యక్తికి గిఫ్ట్‌డీడ్‌గా ఎలా ఇస్తారని ఆయన తన ఫిర్యాదులో ప్రశ్నించారు.

కాగా, ఈ వివాదంపై జావెద్‌ను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దివాన్‌ వారసులతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే తనకు ఆ భూమిని రాసిచ్చారని అతడు పేర్కొన్నట్లు సమాచారం. ఇక, ఈ విషయంపై పోలీసులు తనను సంప్రదించారని ఎమ్మెల్యే విలాస్‌ స్పష్టం చేశారు. అయితే, ఈ భూమి బదిలీకి సంబంధించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తాను పోలీసులకు తెలిపానని ఆయన పేర్కొన్నారు. దీనిపై స్థానిక సీనియర్‌ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. ఫిర్యాదుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గిఫ్ట్‌ డీడ్‌పై సంతకం చేసిన వారితో పాటు సంబంధిత కుటుంబసభ్యులకు సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. డ్రైవర్‌కు, దివాన్ వారసులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

Also Read : Puri Ratha Yatra : జగన్నాథుని రథయాత్రలో అపశృతి ! 500 మందికి పైగా గాయాలు !

Leave A Reply

Your Email Id will not be published!