Umar Alisha: తెలుగు గడ్డకు చెందిన ముస్లిం కవి

తెలుగు గడ్డకు చెందిన ముస్లిం కవుల్లో అగ్రగణ్యుడు

ఉమర్ ఆలీషా

Umar Alisha : ఉమర్ ఆలీ షా (1885 – 1945): తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించిన ఉమర్‌ అలీషా తెలుగు గడ్డకు చెందిన ముస్లిం కవులలో అగ్రగణ్యులు. ఉమర్‌ అలీషా మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో అద్భుత సాహిత్య సంపదలను సృష్టించి మహాకవిగా అతను ఖ్యాతిగాంచారు. సూఫీ వేదాంత వేత్తగా, తెలుగు సాహితీ వేత్తగా, సంఘ సంస్కర్తగా, గ్రాంధికవాదిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా ఉమర్ అలీషా గుర్తింపు పొందారు. అతను ఆధ్యాత్మిక పీఠాధిపతి అయినప్పటికీ కేవలం ఆధ్యాత్మిక తత్వానికే కట్టుబడకుండా సామాజానికి రుగ్మతల మీద తన కలాన్ని కొరడాలా ఝళిపించారు. అజ్ఞానం, మూఢనమ్మకాలు, మత మౌడ్యం, పేదరికం, బానిసత్వం, అవిద్య లాంటి సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించేందుకు అనన్యసామాన్యమైన కృషి చేసారు.

Umar Alisha – ఉమర్ అలీ షా జీవితం- రచనా ప్రస్థానం

ఉమర్‌ అలీషా పూర్వీకులు శతాబ్దాల క్రితం పర్షియా (ఇరాన్‌) నుండి ఢిల్లీ వచ్చి, అటునుండి హైదరాబాద్ చేరి, చివరకు పిఠాపురంలో స్థిరపడ్డారు.
ఉమర్‌ అలీషా(Umar Alisha) పూర్వీకులంతా, వేదాంత పండితులుగా, తత్త్వవేత్తలుగా, కవులుగా, గురువులుగా ప్రశిద్ధి చెందారు. అలీషా పూర్వీకులు 1472లో “శ్రీ విజ్ఞాన విద్యాథ్యాత్మిక పీఠం” స్థాపించి… ఈ పీఠం ద్వారా ధార్మిక విజ్ఞాన ప్రచారం గావిస్తూ, అధ్యాత్మిక సేవకు తమ జీవితాలను అంకితం చేసారు. పిఠాపురం ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన అలీషా ఆ తరువాత ప్రముఖ సంస్కృతాంధ్ర భాషా పండితుల వద్ద శిష్యరికం చేసి ఎనిమిదవ ఏటనే అశువుగా కవిత్వం చెప్పి పండితులను, గురువులను ఆశ్చర్యచకితులను చేశారు. తండ్రి వెంట ఉంటూ అరబ్బీ, పర్షియన్‌, ఉర్దూ భాషలను నేర్చుకున్నారు.

చిన్నతనంలో పలు భాషలతో పరిచయం సంపాదించిన ఉమర్‌ అలీషా 14 సంవత్సరాల వయస్సులో చంధోబద్ధంగా చక్కని తెలుగులో పద్యాలు రాయటం, ధారాళంగా కవిత్వం చెప్పటం ప్రారంభించి, తమ వంశ గురువైన శ్రీ అఖైలలీషాను స్తుతిస్తూ, బ్రహ్మవిద్యా విలాసం అను శతకాన్ని రచించారు. 18వ ఏటనే నాటకాలు రాయటం ప్రారంభించి1905 ప్రాంతంలో గద్య, పద్యాత్మకమైన మణిమాల నాటకాన్ని రాసారు. ఉమర్‌ అలీషా మొత్తం 108 గ్రంథాలు రాశారని ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగానికి చెందిన ఆచార్య యస్‌.యం ఇక్బాల్‌ ప్రకటించారు.

సంఘ సంస్కర్తగా అలీ షా…

బాల్య వివాహాలు, సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త అలీ షా(Alisha). స్త్రీ విద్యకోసం, స్త్రీ గౌరవం కోసం స్త్రీలు స్వయంగా పాటుపడాలని తన గ్రంథాలలోని పాత్రల చేత, తన అభిమతాన్ని చాలా బలంగా చెప్పించారు. అతను రాసిన కళ అను నాటకంలో కుటుంబ జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను-నష్టాలను వివరంగా పేర్కొన్నారు. గృహ బాధ్యతలను మోసే ఇల్లాలి కంటే మంచి నెచ్చలి ఎవరుంటారంటూ, భార్యను స్నేహితురాలిగా గౌరవించాలని ఆ రోజుల్లో పురుషులకు ఉపదేశించేవారు.

స్వాతంత్ర సమరయోధునిగా అలీ షా…

జాతీయ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి పార్టీ పిలుపు మేరకు సాగిన ఉద్యమ కార్యక్రమాలలో అతను పాల్గొన్నారు. మహాత్మాగాంధీ, అలీ సోదరులు, మహమ్మద్‌ అన్సారి లాంటి ప్రముఖులు విజయవాడ వచ్చినప్పుడు వారిని కలసి సమకాలీన పరిస్థితుల మీద చర్చించారు. 1924లో అఖిల భారత ఖిలాఫత్‌ కమిటి ప్రధాన కార్యదర్శిగా, ముస్లిం లీగ్‌ మద్రాసు శాఖకు ఉపాధ్యకక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా నాయకత్వం వహించారు. జాతీయోద్యమ కాలం నాటి ప్రజా పోరాటాలకు స్పందిస్తూ, దేశభక్తి ప్రపూరితమైన పలు పద్యాలను ఆయన రాసారు.

అలీ షా రచనలు, నాటకాలు

ఉమర్ అలీ షా(Alisha) నాటకాల్లో అనసూయాదేవి, కళ, చంద్రగుప్త, మణిమాల, మహాభారత కౌరవరంగము ముఖ్యమైనవి. అలీ షా నవలల్లో తారామతి, పద్మావతి, శాంత ముఖ్యమైనవి.

Also Read : Molla: తెలుగు కవయిత్రి

Leave A Reply

Your Email Id will not be published!