Union Government: ఎన్నికల వేళ బిహార్‌కు కేంద్రం వరాల జల్లు

ఎన్నికల వేళ బిహార్‌కు కేంద్రం వరాల జల్లు

Union Government : అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్‌పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలో సుమారు రూ.6వేల కోట్ల విలువైన రైల్వే, రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా వైద్యవిద్య (పీజీ, యూజీ) సీట్ల పెంపునకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు.

బిహార్‌లో (Bihar) రైల్వేకు సంబంధించి రూ.2192 కోట్లతో భక్తియార్‌పుర్‌-రాజ్‌గిర్‌-తిలయ్యా డబ్లింగ్‌ పనులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇక సాహెబ్‌గంజ్‌-అరెరాజ్‌-బెతియా మధ్య రూ.3822 కోట్లతో 78.9 కి.మీ నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుతో రాజధాని పట్నా-బెతియా మధ్య కనెక్టివిటీ మెరుగు పడుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితోపాటు దేశీయ నౌకా నిర్మాణం, సముద్ర రంగాల పునరుజ్జీవనానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.69,725 కోట్ల ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

Union Government – 5వేల పీజీ మెడికల్‌ సీట్లు

దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర కేబినెట్‌ (Union Government) మరో నిర్ణయం తీసుకుంది. కొత్తగా 5వేల పీజీ సీట్లకు ఆమోదం తెలిపింది. వీటితోపాటు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం (CSS) మూడో ఫేజ్‌ కింద 2028-29 నాటికి ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 5023 ఎంబీబీఎస్‌ సీట్లను పెంచాలని నిర్ణయించింది. ఈ పథకం అమలుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పూర్తి మార్గదర్శకాలు జారీ చేయనుంది.

దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం – రాహుల్‌

ఎన్నికల్లో ఓట్లచోరీ జరిగినంత కాలం దేశంలో నిరుద్యోగం, అవినీతి పెరుగుతూనే ఉంటాయని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. ఇకపై యువత దీన్ని సహించబోదని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. దేశంలో యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమేనని, అది నేరుగా ఓట్లచోరీతో ముడిపడి ఉందని ఆరోపించారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని తాము అధికారంలోకి వచ్చినప్పుడు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే మొదటి కర్తవ్యమని పేర్కొన్నారు. భాజపా నిజాయతీగా ఎన్నికల్లో గెలవట్లేదని, ఓట్లను దొంగిలించి అధికారంలో ఉంటోందని విమర్శించారు. పరీక్ష పత్రాలన్నీ లీక్‌ కావడంతో నియామకాల్లో అవినీతి పెరిగిపోయిందని, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆరోపించారు. యువత సమస్యలపై ప్రధాని మోదీ దృష్టి పెట్టకుండా, తన సొంత ప్రచారం, ప్రముఖుల ప్రశంసలు, బిలియనీర్ల లాభాలపైనే శ్రద్ధ చూపుతున్నారని రాహుల్‌ మండిపడ్డారు.

బీహార్‌లో విజయానికి రాహుల్ 10 పాయింట్ల ప్రణాళిక

బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ కూటమి‌ గెలిస్తే, రూ. 25 కోట్లకు పైగా విలువైన ప్రైవేట్, ప్రభుత్వ కాంట్రాక్టులలో అత్యంత వెనుకబడిన తరగతులకు (ఈబీసీ) రిజర్వేషన్లు కల్పిస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. పట్నాలో జరిగిన అతి పిచ్రా న్యాయ సంకల్ప్ సింపోజియంలో రాహుల్‌ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని హామీనిచ్చారు.

నేటికీ ఈ దేశంలో అత్యంత వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలవారు ఉన్నారు. వారిలోని అర్హులైనవారికి అన్నింటా భాగస్వామ్యం లభించడం లేదు. దేశం అంతటా ఇలానే ఉంది. తాము కుల గణన నిర్వహించి, ఈ దేశంలో దళితులు, అత్యంత వెనుకబడిన తరగతుల నిజమైన జనాభాను చూపించాలనుకుంటున్నామని రాహుల్‌ పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తూ, జేడీయూ ప్రభుత్వం ఈబీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు. న్యాయ సంకల్ప్ సింపోజియంలో పది అంశాల తీర్మానాన్ని రాహుల్‌ ఆవిష్కరించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు దీనిని అమలు చేస్తామని తెలిపారు.

‘ఎక్స్‌’లో కాంగ్రెస్ పోస్ట్ లోని వివరాల ప్రకారం పది అంశాలు ఇవే

1. అత్యంత వెనుకబడిన తరగతులపై దురాగతాల నివారణ చట్టానికి ఆమోదం.
2. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో ఈబీసీలకు రిజర్వేషన్లను 20శాతం నుండి 30శాతానికి పెంచడం.
3. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయడానికి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌ను సవరించడం.
4. నియామకాలలో సముచితమైనది కాదు (ఎన్‌ఎఫ్‌ఎస్‌) నిబంధన చెల్లదని ప్రకటించడం.
5. ఈబీసీ జాబితా రూపకల్పనలో సమతుల్యానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం.
6. భూమిలేని కుటుంబాలకు భూమిని కేటాయించడం.
7. పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈబీసీల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు.
8. విద్యా హక్కు చట్టం (2010) కింద ప్రైవేట్ పాఠశాలల్లో రిజర్వ్ చేసిన సీట్లలో సగం ఈబీసీ, ఓబీసీ, దళిత, గిరిజన వర్గాల పిల్లలకు కేటాయింపు.
9 రూ.25 కోట్ల వరకు ప్రభుత్వ కాంట్రాక్టులలో ఈబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించడం.
10. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5) కింద అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలలో రిజర్వేషన్లను వర్తింపజేయడం.

Also Read : Ladakh: హింసాత్మకంగా మారిన లద్దాఖ్‌ రాష్ట్ర హోదా ఆందోళనలు

Leave A Reply

Your Email Id will not be published!