G Kishan Reddy : ఎన్నికలప్పుడే కార్మికులు గుర్తొస్తారా
కేసీఆర్ పై నిప్పులు చెరిగిన కిషన్ రెడ్డి
G Kishan Reddy : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి(G Kishan Reddy) సీరియస్ కామెంట్స్ చేశారు. సింగరేణి కంపెనీపై రాష్ట్ర సర్కార్ రాజకీయం చేస్తోందంటూ ఆరోపించారు. రోజు రోజుకు కార్మికులను తగ్గిస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి దాకా కంపెనీ బాగు కోసం పని చేస్తూ వస్తున్న కాంట్రాక్టు కార్మికులను ఎందుకు పర్మినెంట్ చేయడం లేదంటూ ప్రశ్నించారు. గతంలో కార్మికుల సంఖ్య 62 వేల నుంచి 40 వేలకు పడి పోయిందని మండిపడ్డారు.
దేశానికి తలమానికంగా ఉన్న సింగరేణి ఇవాళ దిక్కు లేనిదిగా తయారైందని దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వమేనని ఆరోపించారు. సింగరేణిలో ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించడం, సిబ్బందిని కావాలని తగ్గించడం, గనుల్లో భద్రత లోపించడం, అన్ని వ్యవహారాలలో రాజకీయ జోక్యం చేసుకోవడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు జి. కిషన్ రెడ్డి(G Kishan Reddy). కేవలం ఎన్నికలప్పుడే కేసీఆర్ కు సింగరేణి కార్మికులు గుర్తుకు వస్తారని ఆ తర్వాత మరిచి పోతారంటూ ఎద్దేవా చేశారు.
సింగరేణిని పూర్తిగా నాశనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కార్మికులను కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తమ ప్రభుత్వం వస్తే సింగరేణికి పూర్వ వైభవం తీసుకు వస్తామన్నారు కేంద్ర మంత్రి. సింగరేణి అకౌంట్ లో రూ. 3,500 కోట్ల బ్యాంకులో డబ్బులు ఉండేవని కానీ ఇప్పుడు రూ. 10 వేల కోట్ల అప్పులకు చేరుకుందని దీనికి కారణం ఎవరు అంటూ ప్రశ్నించారు. సీఎస్ఆర్ కింద సింగరేణి నుంచి రూ. 250 కోట్ల మేర బీఆర్ఎస్ నేతలు తమ సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు.
Also Read : అవినాష్ రెడ్డికి సీబీఐ ప్రశ్నల వర్షం