Uttar Pradesh: 37 ఏళ్లుగా నెలకు రూ.750 జీతం తీసుకుంటున్న ఉద్యోగులు

37 ఏళ్లుగా నెలకు రూ.750 జీతం తీసుకుంటున్న ఉద్యోగులు

Uttar Pradesh : ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలు… అది పర్మినెంట్ అయినా, కాంట్రాక్టు అయినా చివరకు అవుట్ సోర్సింగ్ అయినా ఉద్యోగ భద్రత ఉంటుందని ప్రజల నమ్మకం. అందుకే ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడుతుంటారు. చేసిన పనితో సంబంధం లేకుండా వేతనాలు రావడంతో పాటు… ఏటా ఎంతో కొంత జీతం పెరుగుదల ఉంటుంది… అనేక రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అందుకే అందరూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) లో రవాణాశాఖలో పనిచేస్తున్న పార్ట్‌టైం పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా 37 ఏళ్లనుంచి ఒక్కటే వేతనాన్ని అమలుచేస్తున్నారు. 37 ఏళ్ళ క్రితం ఉద్యోగంలో చేరిన వ్యక్తులు ఇప్పటికీ నెల జీతం రూ.750 మాత్రమే అందుకుంటున్నారు.

అయితే ఎప్పటికైనా వేతనం పెంచుతారన్న ఆశతో ఏళ్లతరబడి పనిచేస్తూ వచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఇటీవల ఉపశమనం కల్పించింది. వారి జీతాన్ని దాదాపు రూ. 10 వేల వరకు పెంచింది. యూపీ (Uttar Pradesh) ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ బ్రజేశ్‌ నారాయణ్‌ సింగ్‌ ఇటీవల బస్తీ జిల్లాలో పర్యటించారు. స్థానిక ఆర్టీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వృద్ధ మహిళను పలకరించి జీతం వివరాలు ఆరా తీశారు. నెలకు రూ.750 వస్తుందంటూ ఆమె చెప్పడంతో అవాక్కయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న 24 మంది పార్ట్‌టైం పారిశుద్ధ్య కార్మికుల జీతాలను పెంచేందుకు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన చొరవ ఫలించి.. జీతాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

ఈ క్రమంలోనే సంబంధిత కార్మికులను లఖ్‌నవూలో సత్కరించారు. ఈ సందర్భంగా వారు వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ… ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు (Yogi Adityanath) కృతజ్ఞతలు తెలిపారు. అనేక సంవత్సరాలుగా అతి తక్కువ జీతాలతోనే నెట్టుకొచ్చామని, రోజంతా కార్యాలయంలోనే గడిచిపోయేదని తమ పరిస్థితులను గుర్తుతెచ్చుకున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తే భవిష్యత్తు మరింత భద్రంగా ఉంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Uttar Pradesh – స్కూల్లో టీచర్‌, కేర్‌టేకర్‌ అన్నీ ఆమె.. కాని జీతం మాత్రం రూ.1700

ఏ పాఠశాలలో అయినా టీచర్‌, వంటమనిషి, కేర్‌ టేకర్‌ అంటూ ఒక్కో పనికి వేర్వేరు ఉద్యోగులు ఉంటారు. కానీ, అక్కడి స్కూల్‌లో ఆ పనులన్నింటినీ ఒక్కరే నిర్వహిస్తున్నారు. ఆవిడే మాలతీ కుమారి. ఝార్ఖండ్‌ రాంచీలోని (Ranchi) ఓ మారుమూల గ్రామం. అక్కడ ఓ ప్రాథమిక పాఠశాల. ఒకటి నుంచి అయిదో తరగతి చదువుతున్న మొత్తం 35 మంది పిల్లలు. వాళ్లకు మాలతీ ఒక్కరే ఉపాధ్యాయురాలు. ప్రభుత్వం రికార్డుల ప్రకారం ఆమె ప్రధానోపాధ్యాయురాలు కూడా. కానీ, ఇక్కడ ఆమె కేవలం టీచర్‌గానే కాకుండా వంటమనిషిగా, పిల్లల కేర్‌టేకర్‌గా అన్ని పనులు నిర్వహిస్తున్నారు.

ఇన్ని చేస్తున్నప్పటికీ.. ఆమెకు వచ్చే జీతం ఎంతో తెలుసా ? కేవలం రూ.1700. అది కూడా ఎప్పుడో ఒకసారి ఆమె బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది. ఏళ్ల క్రితమే మాలతీ భర్త చనిపోయారు. దీంతో కుటుంబం బాధ్యతలను ఆమే నిర్వహిస్తోంది. ఉపాధ్యాయురాలు కావడంతో మాలతీకి వితంతు పింఛను కూడా రావడం లేదు. దీనికి తోడు మధ్యాహ్నం భోజన పథకం కింద రావాల్సిన సరకులు, సామాగ్రి కూడా అధికారులు సరిగా సప్లయ్‌ చేయకపోవడంతో కొన్నిసార్లు సొంత ఖర్చుతో పిల్లలకు భోజనాలు వండి పెడుతున్నారు. ఇది ఆమెకు ఆర్థికంగా మరింత భారమైంది.

ఇక, 2006లో నిర్మించిన ఈ పాఠశాలలో సౌకర్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. పిల్లల కోసం ఏర్పాటు చేసిన నీళ్ల ట్యాంక్‌ కూడా వరదల కారణంగా దెబ్బతింది. స్కూల్లో మరమ్మతులు చేయడంతో పాటు వంటమనిషిని నియమించాలని మాలతీ ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా విద్యాధికారి వినయ్‌ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని తాము పరిశీలిస్తామన్నారు. దర్యాప్తు చేపట్టి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read : Bihar Assembly Elections: బిహార్ మహా కూటమిలోకి మరో రెండు పార్టీలు !

Leave A Reply

Your Email Id will not be published!