Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి ! ప్రముఖుల సంతాపం !
పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి ! ప్రముఖుల సంతాపం !
Vanajeevi Ramaiah : పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య (85) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా రామయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున ఇంట్లో స్పృహ లేకుండా పడిపోయారు. దీనితో హుటాహుటీన ఆయనను కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆర్ఎంపీకి చూయించి… అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే రామయ్య చనిపోయారు.
Vanajeevi Ramaiah History
కోటి మొక్కలకు పైగా వనజీవి రామయ్య(Vanajeevi Ramaiah), జానకమ్మ దంపతులు నాటారు. కోటికి పైగా మొక్కలను నాటి వనజీవి రామయ్య చరిత్ర సృష్టించారు. మొక్కలను పెంచాలని చిన్నతనం నుంచే ప్రచారం చేశారు. మొక్కలు నాటుతూ దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య సేవ చేశారు. వనజీవి రామయ్యకు నలుగురు పిల్లలు… వారిలో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. వనజీవి రామయ్య భార్య పేరు జానకమ్మ. రామయ్య చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2018లో పద్మశ్రీతో సత్కరించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును వనజీవి రామయ్య ఢిల్లీలో అందుకున్నారు. వనజీవి రామయ్య ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన వారు. ప్రభుత్వ, ప్రైవేటు అవార్డులు, 3వేల షీల్డ్‌లను వనజీవి రామయ్య పొందారు. రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు. రామయ్యను కడసారి చూడటానికి ప్రకృతి ప్రేమికులు, ప్రజలు రెడ్డిపల్లిలోని ఆయన ఇంటికి తరలి వస్తున్నారు. పలువురు రాజకీయ నేతలు రామయ్యకు నివాళి అర్పిస్తున్నారు.
వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణకు పాటుపడ్డారు – సీఎం రేవంత్ రెడ్డి
పద్మశ్రీ వనజీవి రామయ్య(Vanajeevi Ramaiah) మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు. ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య అని స్మరించుకున్నారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేశారని తెలిపారు. రామయ్య మృతి సమాజానికి తీరని లోటని అన్నారు. కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య ఆత్మకు నివాళి అర్పిస్తున్నానని అన్నారు. రామయ్య సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
నేటి తరానికి ఆదర్శప్రాయుడు వనజీవి రామయ్య – ఏపీ సీఎం చంద్రబాబు
పద్మశ్రీ వనజీవి రామయ్య(Vanajeevi Ramaiah) మృతి వార్త తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) తెలిపారు. ఒక వ్యక్తిగా ఉండి… పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నేటి తరానికి రామయ్య ఆదర్శప్రాయుడని అభివర్ణించారు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వనజీవి రామయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
వనజీవి రామయ్య ప్రకృతి ప్రేమికుడు – వెంకయ్య నాయుడు
ప్రకృతి ప్రేమికుడు, కోటికి పైగా మొక్కలను నాటి వనాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న వనజీవి రామయ్య శనివారం తుది శ్వాస విడిచారని తెలిసి చాలా విచారిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. చిన్ననాటి నుంచే మొక్కలపై మక్కువ పెంచుకున్న దరిపల్లి రామయ్య, వాటి ప్రాధాన్యాన్ని ప్రచారం చేస్తూ జీవితమంతా మొక్కలు నాటడానికి, వాటిని సంరక్షించడానికి అంకితం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారని తెలిపారు. ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్న సనాతన ధర్మాన్ని విశ్వసించి ఆచరణలో పెట్టిన గొప్ప వ్యక్తి పద్మశ్రీ రామయ్య అని కొనియాడారు. మొక్కలు నాటే మహత్కార్యంలో సహధర్మచారిణిగా పాలుపంచుకున్న రామయ్య సతీమణి జానకమ్మకి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెంకయ్య నాయుడు అన్నారు.
ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయాం – కేసీఆర్
వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటని, తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పచ్చదనం పరిరక్షణ కోసం వనజీవి చేసిన కృషిని స్మరించుకున్నారు. పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ(Padma Shri) వనజీవి రామయ్య మృతిపట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వృక్షో రక్షతి రక్షితః ’ అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని కొనియాడారు. మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కేసీఆర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా ఆయన చేసిన త్యాగం అసమాన్యమైనదని కేసీఆర్ అన్నారు.
వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేశారు – కిషన్‌రెడ్డి
వనజీవి రామయ్య మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Minister Kishan Reddy) సంతాపం వ్యక్తం చేశారు. ఇంటిపేరును వనజీవిగా మార్చుకుని పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన.. పద్మశ్రీ(Padma Shri) రామయ్య స్వర్గస్తులయ్యారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకునే క్రమంలో వనజీవి రామయ్య జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్ తరాలకు భవ్యమైన జీవితాన్ని అందించే లక్ష్యంతో కోటికి పైగా మొక్కలు నాటారని తెలిపారు. వనజీవి రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు కిషన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
పర్యావరణ యోధుడు వనజీవి రామయ్య – మంత్రి నారా లోకేష్
వనజీవి రామయ్య మరణం బాధాకరమని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్త చేశారు. “వృక్షో రక్షతి రక్షితః” అన్న రామయ్య జీవన సందేశమే ఆయన జీవిత సారాంశమని స్మరించుకున్నారు. చెట్లను మన వంశపారంపర్యంగా భావించి, వాటిని సంరక్షించడం ద్వారా మన భవిష్యత్తును కాపాడతామని చెప్పిన ఆయన, అసలైన పర్యావరణ యోధుడు అని అభివర్ణించారు. ఆయన శ్రమ, త్యాగం వల్ల ఎన్నో వేల ఎకరాల అడవులు పునరుద్ధరించబడ్డాయని తెలిపారు. పద్మశ్రీ అవార్డు(Padma Shri) ఆయన సేవలకు ఒక గుర్తింపు మాత్రమే, కానీ ఆయన చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. మనందరం ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తేనే రామయ్యకు నిజమైన నివాళి అవుతుందని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
వనజీవి రామయ్య మొక్కలను బిడ్డలవలే పెంచారు – హరీష్‌రావు
ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తెలిపారు. శనివారం సంతాపం ప్రకటిస్తూ ప్రకటన విడుదల చేశారు. రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని రామయ్య త్రికరణ శుద్ధిగా ఆచరించి, మొక్కలను బిడ్డలవలే పెంచారని కొనియాడారు. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారని తెలిపారు. పర్యావరణ హితమే తన ఊపిరిగా భావించిన ఆయన, ఆరోగ్యం సహకరించకున్నా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదని స్మరించుకున్నారు. వారి జీవితం భవిష్యత్ తరాలకు స్పూర్తి అని ఉద్ఘాటించారు. అలాంటి గొప్ప వ్యక్తి వనజీవి రామయ్య నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమని హరీష్‌రావు పేర్కొన్నారు.
Also Read : Intelligence Alert: దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చు నిఘా సంస్థల హెచ్చరిక