Vande Bharat: ఏడు మార్గాల్లో నడిచే వందేభారత్‌ కోచ్‌ల సంఖ్య 20కు పెంపు

ఏడు మార్గాల్లో నడిచే వందేభారత్‌ కోచ్‌ల సంఖ్య 20కు పెంపు

Vande Bharat : ప్రస్తుతం వేగంగా, సౌకర్యంగా ప్రయాణించాలనుకునే వారికి వందే భారత్ రైళ్లు మంచి ఆప్షన్‎గా మారాయి. ఈ క్రమంలో వందేభారత్‌ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో వందే భారత్ (Vande Bharat) కోచ్ ల విషయంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌-తిరుపతి సహా ఏడు మార్గాల్లో నడిచే వందేభారత్‌ రైళ్ల కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. సికింద్రాబాద్‌-తిరుపతి, మంగళూరు సెంట్రల్‌- తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్‌-తిరునల్వేలి, మదురై-బెంగళూరు కంటోన్మెంట్‌, దేవ్‌గఢ్‌-వారణాసి, హవ్‌డా-రౌర్కెలా, ఇందౌర్‌-నాగ్‌పుర్‌ మధ్య నడిచే వందేభారత్‌ రైళ్లలో ఎక్కువ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి.

Vande Bharat Updates

ప్రస్తుతం మూడు మార్గాల్లో 16 కోచ్‌లు, నాలుగు రూట్‌ లలో ఎనిమిది కోచ్‌ల వందేభారత్‌ (Vande Bharat) రైళ్లు నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 16 కోచ్‌ల రైలును 20 కోచ్‌లతో, ఎనిమిది కోచ్‌ల రైళ్ల స్థానంలో 16 కోచ్‌లకు అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ప్రజా సంబంధాలు) దిలీప్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (జులై 31, 2025 నాటికి) వందేభారత్‌ రైళ్ల రద్దీ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని వీటిని అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

సికింద్రాబాద్‌-తిరుపతి 20 కోచ్‌లు

సికింద్రాబాద్‌-తిరుపతి సహా మంగళూరు సెంట్రల్‌- తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్‌-తిరునల్వేలి మార్గాల్లో ప్రస్తుతం 16 కోచ్‌ల వందేభారత్‌ నడుస్తుండగా… దీనిని 20 కోచ్‌లకు పెంచనున్నారు. మిగతా నాలుగు మార్గాల్లో ఎనిమిది కోచ్‌ల రైళ్లు నడుస్తుండగా… వాటి స్థానంలో 16 కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడు మార్గాల్లో కోచ్‌ల అప్‌గ్రేడ్‌తోపాటు మరిన్ని 20 కోచ్‌ల వందేభారత్‌ రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కొత్తగా వచ్చే 16, 8 కోచ్‌ల రైళ్లను కొత్త మార్గాల్లో ఉపయోగిస్తామన్నారు.

ఎందుకు ఈ అప్‌గ్రేడ్ ?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వేగం, ఆధునిక సౌకర్యాలు, విశ్వసనీయతతో కూడిన సర్వీస్ లు ప్రయాణీకులను ఆకర్షించాయి. దీంతో ఈ రైళ్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఏడు కీలక మార్గాల్లో రద్దీ గణనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల సంఖ్యను ఎక్కువ మంది వినియోగించేలా కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.

ఏడు మార్గాలు ఇవే

మంగళూరు సెంట్రల్–తిరువనంతపురం సెంట్రల్

సికింద్రాబాద్–తిరుపతి

చెన్నై ఎగ్మోర్–తిరునల్వేలి

మధురై–బెంగళూరు కంటోన్మెంట్

దేవఘర్–వారణాసి

హౌరా–రూర్కెలా

ఇండోర్–నాగ్‌పూర్

వీటిలో మొదటి మూడు మార్గాలైన మంగళూరు సెంట్రల్–తిరువనంతపురం సెంట్రల్, సికింద్రాబాద్–తిరుపతి, చెన్నై ఎగ్మోర్–తిరునెల్వేలి రూట్లలో ప్రస్తుతం 16-కోచ్‌ల రైళ్లు నడుస్తున్నాయి. వీటిని 20-కోచ్‌లకు అప్‌గ్రేడ్ చేశారు. మిగిలిన నాలుగు మార్గాల్లో 8-కోచ్‌ల రైళ్లను 16-కోచ్‌లుగా మార్చారు. ఈ అప్‌గ్రేడ్‌ తో ప్రయాణీకుల సామర్థ్యం పెరుగుతుంది.

Also Read : Traffic Jam: వరద బీభత్సంతో హైవేపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

Leave A Reply

Your Email Id will not be published!