Vangalapudi Anitha: మహిళల రక్షణకు ‘శక్తి’ యాప్
మహిళల రక్షణకు ‘శక్తి’ యాప్
Vangalapudi Anitha : మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు, పని ప్రదేశాలలో వారికి రక్షణ కల్పించేందుకు కొత్తగా ‘శక్తి’ యాప్‌ను తీసుకొస్తున్నామని ఏపీ హోంశాఖ మంత్రి అనిత(Vangalapudi Anitha) తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ యాప్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారని వెల్లడించారు. మహిళలపై లైంగిక వేధింపులు, దిశ చట్టంపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించిందో లేదో గుండెలపై చేయి వేసుకొని చెప్పాలని అనిత నిలదీశారు
Vangalapudi Anitha : వైసీపీ తెచ్చిన దిశా చట్టానికి చట్టబద్ధత ఉందా – హోంమంత్రి అనిత
ఏపీ శాసనమండలి లో దిశా చట్టం, దిశా యాప్ పై అధికార… ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) మాట్లాడుతూ.. గత (వైసీపీ ప్రభుత్వం హాయాంలో) ఐదు సంవత్సరాల్లో దిశా యాప్‌ను మగవారితో కూడా బలవంతంగా ఫోన్లో ఎక్కించారని… దిశా చట్టమంటూ… చట్టబద్ధతలేని ఓ చట్టాన్ని తెచ్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు. దిశా యాప్ ద్వారా ఎంతమందికి రక్షణ కలిగిందో విపక్ష సభ్యులు చెప్పాలని హోం మంత్రి డిమాండ్ చేశారు.
అసలు దిశా చట్టానికి చట్టబద్ధత ఉందా.. లేదా.. అనేది విపక్ష సభ్యులు చెప్పాలన్నారు. అలాగే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను అధికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది.. హోంమంత్రి వంగలపూడి అనిత వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి, డ్రగ్స్ నిరోధించడానికి.. నిందితులపై ఉక్కుపాదం మోపడానికి సీఎం చంద్రబాబు దానికి సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారని.. ప్రత్యేకంగా ఒక ఈగల్ వింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దానికి ప్రభుత్వం జీవోఎంఎస్ నెం. 145 ఇచ్చిందని, దీనికి బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించడం జరిగిందని హోంమంత్రి తెలిపారు.
దిశా చట్టం ఉంది – వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి
వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ… దిశా యాప్ ద్వారా ఎన్ని కేసులు నమోదయ్యాయో ఒకసారి లెక్కలు చూసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్‌లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దిశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. దిశా యాప్ ఇప్పుడు ప్రభుత్వం వాడకపోతే… దాని స్థానంలో కొత్త యాప్‌ని తీసుకొస్తున్నారా అని వరుదు కళ్యాణి ప్రశ్నించారు.
Also Read : MLC Election Results: ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా కొమరయ్య, శ్రీపాల్‌రెడ్డి ఎన్నిక