VC Sajjanar : తెలంగాణ నుంచి ఒడిశాకు బస్సులు
ఓఎస్ఆర్టీసీతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం
TSRTC VC Sajjanar : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నాక సంస్థను గట్టెక్కించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అందివచ్చిన టెక్నాలజీని ఆధారంగా చేసుకుని మరింత పరుగులు పెట్టించే పనిలో పడ్డారు.
ఎప్పటికప్పుడు సంస్థను పర్యవేక్షిస్తూనే సిబ్బందిని మరింత కార్యోన్ముఖులను చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఆయన కొలువుతీరాక కార్గో సర్వీస్ ను ప్రవేశ పెట్టారు. దీని వల్ల ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరుతోంది. మెల మెల్లగా నష్టాల బాట నుంచి గట్టెక్కేందుకు టీఎస్ఆర్టీసీ ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు రైలు, విమానాలలో అందించే సౌకర్యాలకు ధీటుగా ఆర్టీసీ సంస్థ బస్సులలో కూడా అత్యాధునిక వసతి సౌకర్యాలు కల్పిస్తోంది. తాజాగా లహరి పేరుతో సూపర్ స్లీపర్ లక్జరీ బస్సులను ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. మరో వైపు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఎండీ(TSRTC VC Sajjanar) . తెలంగాణ నుంచి ఒడిశా రాష్ట్రానికి 10 బస్సులు నడపాలని నిర్ణయించారు.
ఇందుకు సంబంధించి ఓఎస్ఆర్టీసీతో ఒప్పందం కూడా చేసుకున్నారు. సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు వీసీ సజ్జనార్ , దిప్తేష్ కుమార్ పట్నాయక్ తో కలిసి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీని వల్ల ఇరు రాష్ట్రాల మధ్య రాక పోకలు మరింత పెరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు ఎండీ సజ్జనార్. దీని వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి మరింత సౌకర్య వంతంగా ఉంటుందని పేర్కొన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ.
Also Read : తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి