Vice President Election: సెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక
సెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక
Vice President Election : ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబరు 9న ఎన్నికలు నిర్వహిస్తామని… అదేరోజు ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించింది. నామినేషన్లను గురువారం నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 21 వరకు నామినే షన్ల దాఖలుకు చివరి తేదీ అని, 22న వాటిని పరిశీలిస్తామని పేర్కొంది. ఈనెల 25 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని వివరించింది.
ఆరోగ్య కారణాలతో జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి జూలై 21న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్డీయే కూటమి గురువారం సమావేశమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి కూటమి నేతలంతా హాజరై ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక (Vice President Election), ఎన్నికల సమన్వయంపై చర్చించారు.
Vice President Election – ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యత ప్రధాని మోదీదే
ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలకు అప్పగిస్తూ ఎన్‌డీఏ కూటమి నిర్ణయం తీసుకుంది. గురువారం పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన బీజేపీ, మిత్ర పక్షాల నేతల భేటీలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డాలతోపాటు జేడీయూ నుంచి లలన్ సింగ్, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, టీడీపీ నుంచి ఎల్. దేవరాయలు, ఎల్‌జేపీ నుంచి చిరాగ్ పాశ్వాన్, ఇంకా అనుప్రియా పటేల్, ఉపేంద్ర కుష్వాహా, ఏఐఏడీఎంకే తదితర ఇతర చిన్న పార్టీల నేతలు సైతం పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని బలపర్చాలనే అంశంపై ఎలాంటి చర్చా జరగలేదని తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఈ నెల 12వ తేదీన స్పష్టత వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఎన్‌ఏడీ పక్షాల మధ్య సమన్వయం కొనసాగింపుపై ఈ సమావేశం చర్చించిందన్నారు.
Also Read : Fishing Harbor Blast: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో పేలుడు ! ముగ్గురు మృతి !
