Vijay : అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉంటుండానే తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. తమిళగ వెట్రి కళగం అనే పార్టీను స్థాపించిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay)… ఇటీవల రాష్ట్ర పర్యటన చేపట్టారు. మరోవైపు స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే… రెండో సారి గెలుపొందాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధిస్తుందంటూ సూపర్‌స్టార్ రజినీకాంత్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ (Vijay) అభిమానులకు సాధారణంగానే మంట పుట్టిస్తున్నాయి.
Vijay Fans Slams
ఇటీవల ఓ ఈ వెంట్ లో పాల్గొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)…. ‘‘స్టాలిన్ తమిళనాట మాత్రమే కాదు భారతీయ రాజకీయాల్లో ఓ ధృవతార. కేంద్రంలోని ప్రభుత్వానికి మాత్రమే కాదు… పాత, కొత్త ప్రత్యర్థులకు ఇప్పుడు ఆయన ఓ సవాల్‌గా మారారు. నా స్నేహితుడు తన మార్క్ చిరునవ్వుతోనే రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నారు. స్టార్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్’’ అంటూ రజినీకాంత్ వ్యాఖ్యానించారు. అన్నింటికీ మించి.. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది. ఎలాంటి తుఫానునైనా తట్టుకునే శక్తి ఉంది ఓ బలమైన కామెంట్ చేశారు.
దీనితో రజనీ కాంత్ (Rajinikanth) వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా విజయ్ (Vijay) అభిమానులు ఊగిపోతున్నారు. అందుకు కారణం… రజినీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక్కరోజు ముందు విజయ్ తన రాజకీయ పార్టీకి కీలకమైన ప్రస్థానం ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి ప్రజా యాత్ర (మీట్ ది పీపుల్) ప్రారంభించారు. ఆ సభలో అలవి కాని హామీలిచ్చారంటూ డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనితో తాజా రజినీకాంత్ కామెంట్లు విజయ్ను (Vijay) ఉద్దేశించి చేసినవేనన్న చర్చ ప్రముఖంగా నడుస్తోందక్కడ.
దళపతినే అంటారా ?
రజినీ కామెంట్లతో అరవ రాజకీయంలో స్టార్ వార్ మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కామెంట్లు చేసిన టైంలో మరో సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ కూడా అక్కడే నవ్వుతూ కనిపించారు. కమల్ ఇప్పటికే డీఎంకే కూటమికి మద్దతు అనే సంగతి తెలిసిందే. దీనితో రాజకీయంగా అడుగులు వేయలేని వాళ్లు, సొంతగా పార్టీని నడిపించుకోలేని వాళ్లు… ఒంటరిపోరుకు సిద్ధమైన విజయ్ను విమర్శించడమా? అంటూ అభిమానులు మండిపడుతున్నారు. దీనికి తోడు మొన్నటిదాకా బీజేపీకి సపోర్ట్‌గా మాట్లాడిన రజినీకాంత్.. ఇప్పుడు అనూహ్యంగా డీఎంకేకు అనుకూలంగా మాట్లాడడం ఆయన డబుల్ స్టాండర్డ్‌కు నిదర్శనమని, రీల్లో సూపర్‌స్టార్ అయినప్పటికీ రియల్ లైఫ్‌లో రజినీకాంత్ ప్యాకేజీ స్టార్ అని, విజయ్ అలా ప్యాకేజీ స్టార్ ఏనాటికి కాబోరని తిట్టిపోస్తున్నారు.
స్టార్డమ్ పెరిగిపోయే క్రమంలో.. రజనీకాంత్ అభిమానులతో విజయ్ అభిమానుల వైరం మొదలైంది. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీతో అది మరింత ముదురుతూ వస్తోంది. గతంలో సినిమా ఈవెంట్లలోనూ స్టేజ్ మీద రజినీకాంత్ ‘‘కుక్క, కాకి’’ అంటూ ఏవో పిట్టకథలతో తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఆ సమయంలో విజయ్ అభిమానులు ఆయన్ని టార్గెట్ చేసేవారు. అంతేకాదు స్వయంగా విజయ్ కూడా అంతే సెటైరిక్‌గా తన సినిమా ఈవెంట్లలో ఆ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఈ క్రమంలో.. కిందటి ఏడాది విల్లుపురంలో జరిగిన టీవీకే తొలి మహానాడు తర్వాత రజినీకాంత్ విజయ్ను ప్రశంసించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఈలోపే.. రాజకీయాల్లో తన ప్రధాన ప్రత్యర్థిగా విజయ్ ప్రకటించిన డీఎంకే, స్టాలిన్‌ను రజినీకాంత్ పొగడ్తలతో ముంచెత్తడంతో పరిస్థితి మళ్లీ మునుపటికి వచ్చింది.
రాజకీయాల్లో రజినీ వెనకడుగులు
1995–1996లో తన హవా కొనసాగుతున్న రోజుల్లో రజినీకాంత్ (Rajinikanth)… రాజకీయాలపై తొలిసారిగా పెదవి విప్పారు. అప్పటి జయలలిత ప్రభుత్వంపై అవినీతి విమర్శలు గుప్పిస్తూ… డీఎంకేకు మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయంలో ఆయన మద్దతూ కీలకంగా మారింది. అయితే 2000 నుంచి దశాబ్దం పాటు ఆయన రాజకీయాలపై మౌనం పాటించారు. బాబా సినిమా టైంలోనూ ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం విస్తృతంగా నడిచినప్పటికీ… ఆయన కేవలం సామాజిక అంశాలపై మాత్రమే స్పందిస్తూ వచ్చారు. దీంతో రజినీ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది.
చివరకు ఆయన పాతికేళ్ల అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ… 2017 డిసెంబర్ 31వ తేదీన రజినీకాంత్ నుంచి రాజకీయ పార్టీ స్థాపన ప్రకటన వెలువడింది. దీంతో అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. 2020 టైంలో ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ సమయంలో తమిళనాట కోలాహాలం నడిచింది. అయితే అదే సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడడం, మరోపక్క కరోనా విజృంభణతో ఆయన వెనకడుగు వేశారు. తన ఆరోగ్య కారణాల రిత్యా రాజకీయ ప్రయత్నాలు విరమించుకుంటున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. దీనితో ఆయన అభిమానులు చల్లబడ్డారు. అయితే అప్పటి నుంచి రాజకీయంగా మాత్రం ఆయన తన అభిప్రాయాలను స్వేచ్ఛగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో కొన్నాళ్ల కిందట ఓ ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏమిటీ ప్యాకేజీ గోల !
అధికార డీఎంకే కుటుంబానికి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గతకొన్నేళ్లుగా అక్కడి అగ్ర హీరోలతో బిగ్‌డీల్(కళ్లు చెదిరే రెమ్యునరేషన్లు, బోనస్‌గా కాస్ట్లీ గిఫ్ట్‌లు కూడా) కుదుర్చుకుని వరుస ప్రాజెక్టులు చేస్తూ వస్తోంది. ఈ లిస్ట్‌లో రజినీకాంత్, కమల్‌హాసన్‌లు కూడా ఉండడం గమనార్హం. రాజకీయంగా తమ ఎదుగుదలకు ఆటంకంగా మారకూడదనే ఉద్దేశంతో వాళ్లను ఇలా బుజ్జగిస్తోందని ముమ్మర ప్రచారం నడిచింది.
తమిళనాట తమకు ప్రతిపక్ష అన్నాడీఎంకే-బీజేపీ మధ్యే ఎన్నికలు జరగాలని డీఎంకే తొలి నుంచి భావిస్తోంది. రజినీకాంత్ కంటే విజయ్‌కు తమిళనాట ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. దీంతో సొంత పార్టీ ప్రకటన కంటే ముందే ఆయన్ను తమ వైపునకు తిప్పే ప్రయత్నమూ డీఎంకే చేసింది. కానీ రాజకీయ అడుగులు వేయాలని బలంగా ఫిక్స్ అయిన విజయ్ ఆ ప్యాకేజీకి ఒప్పుకోలేదని… అందుకే ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యారన్నది ఆ ప్రచార సారాంశం.
ఇక ఏడాదిన్నర కాలంగా డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తరచూ విమర్శలు గుప్పించడం… తాజా మధురై మానాడులో అంకుల్ అని స్టాలిన్‌ను సంబోధిస్తూ విజయ్ విమర్శలు చేయడాన్ని డీఎంకే సీరియస్‌గా భావించింది. ఈ క్రమంలోనే కేసులతో ఇబ్బంది పెడుతోందన్న విమర్శ బలంగా వినిపిస్తోందక్కడ. అయితే.. ఇంత సీరియస్ ఆరోపణలపై ఇటు రాజకీయంగా గానీ, అటు సినిమాలపరంగానూ ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం.
Also Read : Kapidhwaj: భారత సైన్యంలో కపిధ్వజ్ సేవలు
