Vijay: దళపతి విజయ్‌ పార్టీకి ఎన్నికల కమిషన్‌ నుంచి అధికారిక గుర్తింపు !

దళపతి విజయ్‌ పార్టీకి ఎన్నికల కమిషన్‌ నుంచి అధికారిక గుర్తింపు !

Vijay: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌ స్థాపించిన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’కు ఎన్నికల కమిషన్‌ నుంచి అధికారిక గుర్తింపు లభించింది. పోల్‌ ప్యానెల్‌కు చేసిన అభ్యర్థనకు ఏడు నెలల తర్వాత ఆమోదం లభించింది. గత నెల చెన్నై శివారు పనైయూర్‌ లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయ్‌ జెండాను ఆవిష్కరించారు. జెండాలో పైన, కింది భాగంలో ఎరుపు, మధ్యలో పసుపు రంగులు ఉన్నాయి. మధ్యలో ఎరుపురంగు వృత్తాకారం లోపల శిరీష పుష్పం, చుట్టూ 28 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో ఐదు నీలం, మిగతావి పచ్చ రంగులో ఉన్నాయి. శిరీష పుష్పానికి రెండు వైపులా ఘీంకరించే ఏనుగు రూపాలు ఉన్నాయి. తమిళ సంప్రదాయం ప్రకారం ఈ పువ్వును విజయానికి గుర్తుగా అభివర్ణిస్తారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 2న రాజకీయ పార్టీగా గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాడు విజయ్. ‘ఇప్పటివరకు మన కోసం మనం శ్రమించాం.. ఇకపై తమిళనాడు, తమిళుల ఉన్నతి కోసం సమష్టిగా శ్రమిద్దాం’ అని పిలుపునిచ్చారు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని విజయ్‌(Vijay) వెల్లడించారు.

Vijay Party..

ఈ నేపథ్యంలో విజయ్‌ పార్టీకి గుర్తింపు ఇస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే విషయాన్ని ఒక లేఖ ద్వారా విజయ్‌ తెలిపారు. ఎన్నికల సంఘం ప్రకటనతో తన రాజకీయ పార్టీకి గుర్తింపు రావడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ పార్టీ లక్ష్యమని విజయ్‌(Vijay) పేర్కొన్నారు. త్వరలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ కార్యచరణ గురించి వెళ్లడిస్తామని అన్నారు. ఈ క్రమంలో తమిళనాడు విల్లుపురం వేదికగా ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ తొలి భారీ బహిరంగ సభకు పోలీసుల నుంచి అనుమతి వచ్చింది. 21 నిబంధనలతో సభకు అనుమతి లభించింది. దీంతో ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విజయ్‌ రాజకీయ పార్టీని ప్రకటించారు. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ముందే ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏ ఇతర రాజకీయ పార్టీలకు కూడా తన మద్దతు ఇవ్వలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలో తప్పకుండా దిగుతామని విజయ్‌ పేర్కొన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా..? లేదా పొత్తుల సాయంతో ముందుకొస్తారా..? అనే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Also Read : Puja Khedkar: వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌ కు కేంద్రం బిగ్‌ షాక్‌ ! ఐఏఎస్‌ నుంచి తొలగింపు !

Leave A Reply

Your Email Id will not be published!