Vijay Rupani: డిఎన్ఏ ఆధారంగా గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ మృతదేహం గుర్తింపు
డిఎన్ఏ ఆధారంగా గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ మృతదేహం గుర్తింపు
Vijay Rupani : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపాణీ (Vijay Rupani) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 274 మంది మృతి చెందగా… వారి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిబూడిదయ్యాయి. దీనితో ఈ ఘటన జరిగిన మూడు రోజుల అనంతరం విజయ్ రూపాణీ మృతదేహాన్ని గుర్తించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు. రూపాణీ కుటుంబ సభ్యుల నమూనాలతో మృతదేహం డీఎన్‌ఏ సరిపోలిందన్నారు. దీనితో భౌతికకాయాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. రాజ్ కోట్‌లో రూపానీ అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన AI171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. అందులో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. దీనికి తోడు ఎయిర్ ఇండియా విమానం… బీజే మెడికల్ కాలేజీ పీజీ హాస్టల్ భవనంపై కూలడంతో ఆ సమయంలో అక్కడ ఉన్న మరో 33 మంది మృతి చెందారు. ఈ మృతుల్లో 68 ఏళ్ల గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ (Vijay Rupani) కూడా ఉన్నారు.
Vijay Rupani – కొనసాగుతున్న డీఎన్‌ఏ పరీక్షలు ! ఇప్పటివరకు 47 మృతదేహాలు గుర్తింపు !
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ నమూనాతో పోల్చి చూసే ప్రక్రియ మూడు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 47 మందిని గుర్తించగా… 24 మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాద తీవ్రత వల్ల చాలా వరకు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో డీఎన్‌ఏ పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండడం గుర్తింపు ఆలస్యం అవుతోందని తెలిపారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన 11 మంది విదేశీయుల కుటుంబాలను ఇప్పటికే సంప్రదించామన్నారు.
ఘటనా స్థలానికి పీకే మిశ్రా
విమాన ప్రమాద ఘటనా ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా పరిశీలించారు. అనంతరం చికిత్స తీసుకుంటున్న బాధితులు, వారి కుటుంబీకులను పరామర్శించారు. వారికి అందుతున్న సాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను రాష్ట్ర అధికారులు ఆయనకు వివరించారు.
Also Read : Aryan Aviation: చార్‌ధామ్ యాత్రలో ఆర్యన్ ఏవియేషన్ కార్యకలాపాలపై నిషేధం
