Vijayashanti on Bharat Ratna: ఎన్టీఆర్‌ కు కూడా భారతరత్న ఇచ్చి ఉండాల్సింది – విజయశాంతి

ఎన్టీఆర్‌ కు కూడా భారతరత్న ఇచ్చి ఉండాల్సింది - విజయశాంతి

Vijayashanti on Bharat Ratna: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన భారతరత్న అవార్డులపై సినీ నటి, కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూనే… దివంగత నేత పద్మశ్రీ ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ఇచ్చి ఉండాల్సింది అంటూ ఆమె వ్యాఖ్యానించారు. తెలుగు జాతి గౌరవ ప్రతీక పీవీ నరసింహారావు గారిని వరించిన భారతరత్న పురస్కారం… తెలుగు ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు పులకరించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం అంటూ తన సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేసారు. దీనితో పాటు గతంలో ఆమె ఎన్టీఆర్ చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న ఫోటోను కూడా పోస్ట్ చేసారు. ప్రస్తుతం విజయశాంతి(Vijayashanti) పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారుతోంది.

Vijayashanti on Bharat Ratna – విజయశాంతి ఏమని ట్వీట్ చేసారంటే ?

భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక శ్రీ పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించిఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈ రోజున నిండుగా, మెండుగా కనబడుతోంది. ఈ బాధ్యతను భుజాలకెత్తుకుని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను. అన్ని రాజకీయ పార్టీలూ ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

నరేంద్రమోదీ నేతృత్వంలని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాది ఐదుగురికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ, ‘జన నాయక్‌’ గా ప్రసిద్ధి పొందిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కర్పూరీ ఠాకుర్‌ కు భారతరత్న ప్రకటించారు. శుక్రవారం భారత మాజీ ప్రధానులు పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్ లతో పాటు హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌ కు కూడా భారతరత్న అవార్డును ప్రకటించారు. దీనితో ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న ప్రకటించినట్లైయింది. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. అయితే ఎన్టీఆర్ కంటే మాజీ ప్రధాని, తెలుగు తేజం, బహుబాషా కోవిదుడు పీవీ నరసింహారావును ఆ అవార్డు ముందే వరించింది.

Also Read : Violence Erupted in Uttarakhand: ఉత్తరాఖండ్‌ లో అల్లర్లు ! ఆరుగురు మృతి !

Leave A Reply

Your Email Id will not be published!