Vijayawada Floods : గత 3 రోజులుగా ఇబ్బంది పెట్టిన వరదల నష్టాన్ని పరిశీలించిన కేంద్రం
కాగా... భారీ వర్షాలు, వరదలతో ఏపీలో పరిస్థితి దారుణంగా ఉంది...
Vijayawada Floods : ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి. గ్రామాలకు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ క్రమంలో వరద ప్రాంతాల్లో ఏపీలో కేంద్ర బృందం పర్యటించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రానికి చేరుకున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని ఈ సందర్భంగా కేంద్ర బృందం అంచనా వేయనుంది. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను బృందం సభ్యులు అడిగి తెలుసుకోనున్నారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను కేంద్ర బృందానికి అధికారులు వివరిస్తున్నారు. మరికాసేపట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పర్యటించనున్నాయి.
Vijayawada Floods..
కాగా… భారీ వర్షాలు, వరదలతో ఏపీ(AP)లో పరిస్థితి దారుణంగా ఉంది. విజయవాడ(Vijayawada)లో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వివిధ రకాలుగా వరద బాధితులు ఆహారం, మంచి నీరు, మందులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పడవలు, హెలీకాఫ్టర్లు, డ్రోన్ల సాయంతో కాలనీల్లో బాధితులకు భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. మరోవైపు బుడమేరు వరద నుంచి ఇప్పుడిప్పుడు బెజవాడ(Vijayawada) వాసులు కాస్త కోలుకుంటున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో బాధితులు ముంపు ప్రాంతాల్లో భారీ ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. నిన్న ఉదయానికి నాటికి రెండు నుంచి మూడు అడుగుల మేర సింగ్‌నగర్ దూర ప్రాంతాల్లో వరద మట్టం తగ్గింది. దీంతో గత మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన వరద బాధితులు బయటకు వచ్చేశారు.
సింగ్‌నగర్ నుంచి దూరప్రాంతాలైన కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీ, రాజీవ్‌నగర్, ప్రకాష్‌నగర్, ఎల్‌బీఎస్ నగర్, రాధానగర్, డాబాకొట్లు సెంటర్, ఇందిరానాయక్ నగర్, పైపులరోడ్డు, తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు పోటెత్తారు. కాగా… బాధితుల తరలింపు తక్కువగా ఉండటం వల్ల అగ్నిమాపక శకటాలు తమ పనులు నిర్వహించలేకపోయాయి. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకుల పంపిన ట్రాక్టర్లు బాధితుల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వరద నుంచి వచ్చే బాధితులు దాదాపుగా నాలుగు నుంచి పది కిలో మీటర్ల మేర నడుచుకుని రావటంతో వారికి స్వాంతన కలిగించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆటోలు, లారీలు, మినీవ్యాన్‌లు, ట్రాక్టర్ల వంటివి పెద్ద సంఖ్యలో నడిపాయి. పైపులరోడ్డు, గొల్లపూడి, తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది.
Also Read : Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మత్తు పనులు షురూ చేసిన అధికారులు