Vikram Misri: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాకిస్తాన్ సైనిక అధికారులు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాకిస్తాన్ సైనిక అధికారులు

Vikram Misri : పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది భారత్ తో సహా అనేక దేశాలు గత కొన్ని దశాబ్దాలుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినప్పటికీ… ప్రస్తుతం తమ దేశంలో ఉగ్రవాదులు లేరని బుకాయిస్తోంది. అయితే ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ ప్రపంచానికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. 26 మంది పర్యాటకులను బలితీసుకున్న పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా… భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ సిందూర్ లో భాగంగా… పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో సుమారు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ జరిపిన దాడుల్లో మరణించిన జైషే ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ అజహర్‌ సహా… జైషే మహ్మద్ చీఫ్ మహ్మద్ అజార్ కు చెందిన 14 మంది కుటుంబ సభ్యులు మృతి చెందారు.

Vikram Misri Sensational

అయితే ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) లో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ సైనిక అధికారులు పాల్గొనడంతో… ఉగ్రవాదంపై పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలయింది. ఇదే విషయాన్ని భారత హై కమీషనర్ విక్రమ్(Vikram Misri) దొరైస్వామి ప్రపంచం ముందుకు కీలక ఆధారాలు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పాక్‌ లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ జరిపిన దాడుల్లో మరణించిన జైషే ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ అజహర్‌, ఇతర ఉగ్రవాదుల అంత్యక్రియలకు అక్కడి సైన్యం, ప్రభుత్వ అధికారులు హాజరై, నివాళులు అర్పిస్తున్న ఫొటోను జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అందులో ఉగ్రవాదుల శవపేటికలపై పాకిస్థాన్‌ జెండాలు కప్పి ఉన్నాయి. దీని ద్వారా ఉగ్రవాదుల వెనుక ఎవరున్నారనే విషయం ప్రపంచ దేశాలకు తెలుస్తోందని విక్రమ్ దొరైస్వామి పేర్కొన్నారు. ఇందుకు ఇంతకంటే సరైన ఆధారం మరొకటి ఉండదని అన్నారు.

రవూఫ్‌ అజహర్‌ పలు ఉగ్రదాడుల్లో నిందితుడు. 1999లో జరిగిన ఐసీ814 విమాన హైజాక్‌లో కూడా రవూఫ్‌ అజహర్‌ హస్తం ఉంది. ఐదుగురు పాక్‌ ఉగ్రవాదులు నేపాల్‌ లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసి కాందహార్‌కు చేర్చారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి… భారత జైళ్లలో ఉన్న మసూద్‌ అజహర్‌, అహ్మద్‌ ఒమర్‌ సయీద్‌ షేక్‌, ముస్తాక్‌ అహ్మద్‌ జర్గర్‌ అనే ఉగ్రవాదులను విడిపించుకొని తీసుకెళ్లారు. ఆ తర్వాతే మసూద్‌ అజహర్‌ జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఇక 2001లో జరిగిన పార్లమెంట్‌పై దాడి, 2016లో పఠాన్‌ కోట్‌ దాడి, 2019లో పుల్వామా బాంబింగ్‌ వంటి ఉగ్ర ఘటనల్లో రవూఫ్‌ ప్రమేయం ఉంది. ప్రస్తుతం జైషే మొహమ్మద్‌ కీలక కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు.

పాక్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే విషయంపై ఆ దేశ విదేశాంగశాఖ మాజీ మంత్రి, పాకిస్థాన్‌(Pakistan) పీపుల్స్‌ పార్టీ చీఫ్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ ఇటీవల మాట్లాడుతూ… పాక్‌కు ఉగ్ర చరిత్ర ఉందనేది రహస్యం కాదని… దీనివల్ల దేశంలో ఇస్లామీకరణ, సైనికీకరణ చోటుచేసుకుందన్నారు. ఉగ్ర సంబంధాల ఫలితంగా తామూ ఇబ్బందిపడ్డామని పేర్కొన్నారు. ఉగ్రవాదం వల్ల తమ దేశం నష్టపోవడంతో… ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకొని సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టామని తెలిపారు. పాక్‌ కు ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేవని భుట్టో కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించారు. అయితే తాజాగా ఫోటోలతో పాకిస్తాన్ అసలు రూపం బయటపడింది.

Also Read : Indus Waters Treaty: ‘సింధు జలాల ఒప్పందం’పై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!