Visakhapatnam CP: తహసీల్దార్ హత్య కేసులో నిందితుడి అరెస్టు !
తహసీల్దార్ హత్య కేసులో నిందితుడి అరెస్టు !
Visakhapatnam CP: విశాఖలో సంచలనం సృష్టించిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్థిరాస్తి లావాదేవీల నేపథ్యంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్న మురారి సుబ్రహ్మణ్యం గంగారావు… తహసీల్దార్ రమణయ్యను హత్య చేసినట్లు విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు. ఈ మేరకు మరారి సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేయడానికి పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసామని… వాటిలో ఏసీపీ త్రినాథ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం చెన్నైలో అతడ్ని అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. విశాఖ జాయింట్ కమీషనర్ ఫకీరప్ప, డీసీపీ మణికంఠ ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపడుతున్నారని ఆయన స్పష్టం చేసారు.
Visakhapatnam CP Comment
ఈ సందర్భంగా విశాఖ(Visakhapatnam) సీపీ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ… ‘‘స్థిరాస్తి లావాదేవీలే హత్యకు కారణం. నిందితుడి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశాం. హత్య చేసిన తర్వాత నిందితుడు విమానంలో విశాఖ నుంచి బెంగళూరు వెళ్లాడు. తర్వాత చెంగల్పట్టు నుంచి చెన్నై వెళ్తుంటే… చెన్నై పోలీసులు సహాయంతో అరెస్టు చేసి విశాఖ తీసుకొచ్చాం. గంగారావు ఓ స్థిరాస్తి సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడిపై హైదరాబాద్, విజయవాడలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు రూ.5 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది’’ అని సీపీ రవిశంకర్ తెలిపారు.
విశాఖ రూరల్ (చినగదిలి) తహసీల్దార్ గా పనిచేస్తున్న సనపల రమణయ్యను… ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ చేసారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బొండపల్లిలో విధులు స్వీకరించి… తిరిగి కొమ్మాదిలోని తాను నివాసం ఉంటున్న చరణ్ క్యాస్టల్ అపార్ట్ మెంట్ కు వచ్చారు. అయితే రాత్రి పది గంటల సమయంలో ఓ వ్యక్తి నుండి ఫోన్ రావడంతో ఐదో అంతస్థులో నివాసం ఉంటున్న రమణయ్య… క్రిందకు దిగారు. వచ్చిన వ్యక్తితో మాట్లాడుతుండగా… అదే వ్యక్తి ఇనుపరాడ్ తో తహసీల్ధార్ పై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడ నుండి పరారయ్యాడు. కొనఊపిరితో ఉన్న రమణయ్యను… స్థానికులు, కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించగా… అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందారు. దీనితో తహసీల్ధార్ రమణయ్య హత్యకేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది.
Also Read : AP JAC Strike Warning: ప్రభుత్వానికి ఉద్యోగుల సమ్మె హెచ్చరికలు ?